Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల వ్యూహంలో వైసీపీ దూకుడు.. మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీకారం!

షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత‌.. 'బ‌స్సు యాత్ర‌' పేరుతో మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి వైసీపీ రెడీ అయి.. స‌క్సెస్ చేసుకుంది.

By:  Tupaki Desk   |   2 May 2024 3:51 PM GMT
ఎన్నిక‌ల వ్యూహంలో వైసీపీ దూకుడు.. మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీకారం!
X

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ద‌శ‌ల వారీగా వ్యూహాలు ప‌న్నుతూ.. దూసుకుపోతున్న వైసీపీ ఇప్పుడు మ‌రో వినూత్న కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించింది. అదే.. ``కలలు నిజం చేయడానికి.... జగన్ కోసం సిద్ధం'' కార్య‌క్ర‌మం. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌షెడ్యూల్ విడుద‌ల కావ‌డానికి ముందుగానే వైసీపీ కీల‌క కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టింది. సిద్ధం పేరుతో సీఎం జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా స‌భ‌లు పెట్టారు. మొత్తంగా మూడు ప్రాంతాల్లో నాలుగు కీల‌క స‌భ‌ల‌ను నిర్వ‌హించి.. ఎన్నిక‌ల‌కు తాము సిద్ధ‌మ‌య్యామ‌ని చెప్పారు. అప్ప‌టికి ఇంకా విప‌క్షాలు కూట‌మి క‌ట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత‌.. 'బ‌స్సు యాత్ర‌' పేరుతో మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి వైసీపీ రెడీ అయి.. స‌క్సెస్ చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా సీఎం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర చేశారు. క‌డ‌ప నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు ఆయ‌న బ‌స్సు యాత్ర ద్వారా సుమారు 2500 కిలో మీట‌ర్ల దూరాన్ని 22 రోజుల్లో పూర్తి చేసి.. భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించారు. త‌ద్వారా.. ప్ర‌జ‌ల్లోకి వైసీపీని బ‌లంగా తీసుకువెళ్లే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. `మేమంతా సిద్ధం` పేరుతో ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో రోజుకు మూడు చొప్పున చుట్టేస్తున్నారు.

అభ్య‌ర్థుల త‌ర‌ఫున సీఎం జ‌గ‌న్ ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల‌కు 10 రోజులు మాత్ర‌మే మిగిలింది. మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా.. 11వ తేదీ రాత్రితో ప్ర‌చారాన్ని బంద్ చేయాల్సి ఉంది. 12వ తేదీని కూలింగ్ పిరియ‌డ్‌గా లెక్కిస్తారు. దీంతో ఆ రోజు ప్ర‌చారానికి పెద్ద‌గా అవ‌కాశం ఉండ‌దు. అయితే.. ఆన్ లైన్‌లో ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థులు ఇంటింటికీ వెళ్లి ప్ర‌చారం చేయొచ్చు. ఈ నేప‌థ్యంలో మిగిలిన 10 రోజుల‌ను స‌ద్వినియోగం చేసుకునేందుకు సీఎం జ‌గ‌న్ తాజాగా మ‌రో కార్య‌క్ర‌మానికి సిద్ధ‌మ‌య్యారు. అదే.. 'కలలు నిజం చేయడానికి.... జగన్ కోసం సిద్ధం'. ఇప్పటికే దీనికి సంబంధించిన హోర్డింగ్ లు రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. దీనికి ఎన్నికల సంఘం కూడా అనుమ‌తి ఇచ్చింది.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేకంగా ఇంటింటి ప్ర‌చారం చేస్తారు. ఇప్ప‌టికే ఉన్న గృహ సార‌థులు, రాజీనామాలు చేసిన వలంటీర్ల‌ను ఇంటింటికీ పంపించ‌నున్నారు. క‌ర‌ప‌త్రాలు, పార్టీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోల‌ను ఇంటింటికీ వీరి ద్వారా ప్ర‌తి ఒక్క కుటుంబానికీ ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అభివృద్ధి, సంక్షేమాల‌ను వివ‌రించ‌నున్నారు. మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. చేసేది వివ‌రించ‌నున్నారు. మొత్తంగా మేనిఫెస్టోను ప్రతి ఇంటికీ చేరవేయడమే 'జగన్ కోసం సిద్ధం` కార్య‌క్ర‌మం ల‌క్ష్యంగా ఉంది. మొత్తానికి ఇదే చివ‌రి వ్యూహమ‌నిపార్టీ నాయ‌కులు చెబుతున్నారు.