మత్య్సకారుల భూమిలో వైసీపీ ఆఫీసు కడుతున్నారా?
ఇప్పటికే దీని గురించి అసలు నిజం ప్రజలకు తెలిసిందని, నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న అక్రమ కట్టడాన్ని అడ్డుకుంటే మరింత అభాసు పాలవుతామనే కారణంతోనే వైసీపీ సైలెంట్‌గా ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 22 Jun 2024 1:30 PM GMTతాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని నిబంధనల మేరకు ప్రభుత్వ అధికారులు కూల్చేశారు. మత్స్యకారుల భూమి కొట్టేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనం నిర్మిస్తున్నారని కూల్చేశారు. కానీ సాధారణంగా అయితే ఇలాంటివి జరుగుతున్నప్పుడు వైసీపీ డ్రామా చేస్తుందనే టాక్ ఉంది. కానీ తమ పార్టీ కార్యాలయాన్ని పడగొడుతున్నా అక్కడ వైసీపీ హంగామా లేకపోవడం గమనార్హం. ఇప్పటికే దీని గురించి అసలు నిజం ప్రజలకు తెలిసిందని, నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న అక్రమ కట్టడాన్ని అడ్డుకుంటే మరింత అభాసు పాలవుతామనే కారణంతోనే వైసీపీ సైలెంట్‌గా ఉందని అంటున్నారు.
ఈ కార్యాలయాన్ని కూల్చేస్తారని వైసీపీకి సమాచారం ఉంది. అందుకే రాత్రికి రాత్రే హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కానీ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు చెప్పింది. ఈ కూల్చివేత అనేది నిబంధనల ప్రకారమే జరుగుతుందని తెలుసు.
అయినా కూడా అక్కడ ఏదో జరిగిపోతోందని, బాబు అధికారంలోకి రాగానే విధ్వంసం సృష్టిస్తున్నారని వైసీపీ హడావుడి చేస్తుందేమో అనిపించింది. కానీ అలాంటిదేమీ లేదు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఆ స్థలాన్ని పార్టీ ఆఫీసుకు కేటాయించడంలో కీలక పాత్ర పోషించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అక్కడికి రాలేదు.
వైసీపీ అధినేత జగన్ మాత్రమే ఎక్స్‌లో పోస్టు చేస్తూ ఎప్పటిలాగే బాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. కానీ ఆ భవనం కూల్చివేత దగ్గర వైసీపీ హంగామా మాత్రం లేదు. అసలే అక్రమ కట్టడం, అడ్డుకునేందుకు వెళ్తే కేసులు పెట్టే ప్రమాదం ఉంది.
ఇప్పుడు అధికారం కూడా లేదు. పైగా జగన్ పట్టించుకుంటారన్న నమ్మకమూ లేదు. అందుకే అక్కడికి వెళ్లి కేసుల్లో ఇరుక్కోవడం కంటే కూడా ఇంట్లో ఉండటం మేలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.