Begin typing your search above and press return to search.

వైసీపీ న్యాయ పోరాటం చేస్తుందా ?

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి విపక్ష హోదా కోసం జగన్ తాజాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు

By:  Tupaki Desk   |   28 Jun 2024 4:18 AM GMT
వైసీపీ న్యాయ పోరాటం చేస్తుందా ?
X

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి విపక్ష హోదా కోసం జగన్ తాజాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. స్పీకర్ దీని మీద ఏ రకంగా స్పందిస్తారో తెలియదు కానీ టీడీపీ మంత్రులు నేతలు మాత్రం స్పందించారు. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వనవసరం లేదని వారు వాదించారు. ఆయన ఒక ఎమ్మెల్యే అని కొందరు అంటే ఫ్లోర్ లీడర్ మాత్రమే అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

జగన్ సభకు వస్తే గౌరవిస్తామని అంతకు ముందే స్పీకర్ అయ్యన్నపాత్రుడు మీడియా ముఖంగా చెప్పారు. అయితే ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కుతుందని చట్టంలో హోదాకు నిర్దిష్ట సంఖ్యను చెబుతూ ఎలాంటి నిబంధనలూ లేవని వైసీపీ వాదిస్తోంది. చాలా మంది హోదా విషయంలో ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదు.

సభా సంప్రదాయాలు అని అందరూ అనుసరించిన మార్గంలోనే వెళ్ళారు. అయితే వైసీపీ ఈ విషయంలో పట్టుదలగా ఉంది. సీరియస్ గానూ ఉంది. దాంతో వైసీపీ స్పీకర్ స్పందనను చూసాక న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని అనుకుంటోందని ప్రచారం సాగుతోంది.

చట్ట సభలలో అధికార పక్షం తరువాత ఎక్కువ సంఖ్యలో సభ్యులు ఉన్న తరువాత పక్షం ప్రతిపక్షమే అవుతుంది అని అంటున్నారు. దానికి సభ్యుల సంఖ్యతో సంబంధం లేదని అంటున్నారు. ఇదే విధంగా ఏపీలో 1953లో చేసిన ఆంధ్రప్రదేశ్ పేమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ యాక్ట్ -1953 ప్రకారం వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధం అవుతోంది అని అంటున్నారు.

ఈ యాక్ట్ లో సంఖ్యాబలం ఆధారంగా ప్రతిపక్షాన్ని నిర్ధారించమని ఎక్కడా లేదని వైసీపీ వాదిస్తోంది. అధికార పక్షం తరువాత విపక్షంలో ఎవరికి ఎక్కువ బలం ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉందని చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఏపీ అసెంబ్లీలో ఉన్నవి నాలుగు పార్టీలు. అందులో మూడు పార్టీలు కూటమి కట్టి అధికారంలో ఉన్నాయి.

దాంతో మిగిలిన ఏకైక పార్టీగా వైసీపీకే విపక్ష హోదా దక్కుతుందని ఆ పార్టీ అంటోంది. ఈ విషయంలో న్యాయం కోసం ఉన్నత న్యాయ స్థానానికి వెళ్లాలని యోచిస్తోందని అంటున్నారు. అయితే చట్ట సభలలో జరిగే వ్యవహారాల విషయంలో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు. కానీ ప్రజాస్వామ్య హితం కానివి రాజ్యాంగం ఉల్లంఘనీయమైనవి అని తోచినపుడు కోర్టులు ముందుకు వస్తాయి.

అలా రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడినపుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. నిజానికి శాసన సభలో స్పీకర్ విచక్షణ మీదనే అంతా ఆధారపడి సాగుతుంది. ఎవరికి ఏ హోదా ఇవ్వాలి అన్నది స్పీకర్ నిర్ణయిస్తారు. అక్కడ ఆయనే న్యాయమూర్తి. అయితే స్పీకర్ ని ఈ విషయంలో చట్టం నిబంధనల మేరకు వ్యవహరించమని కోర్టులు కోరుతాయా అలా జరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది.