గృహ సారథులే కొంప ముంచారా... వైసీపీలో కొత్త రగడ...!
అయితే.. ఇలా ఎంపిక చేసిన గృహ సారథులు కూడా మెజారిటీ మనుషులు టీడీపీ సానుకూలంగా ఉన్నవారినే ఎంపిక చేశారన్నది ఇప్పుడు వైసీపీ చెబుతున్న మాట.
By: Tupaki Desk | 8 Aug 2024 8:30 PM GMTఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ తీసుకువచ్చిన మరో కీలక అంశం.. గృహ సారథులు. ప్రతి ఇంటికీ వెళ్లి.. వైసీపీ సర్కారు తరఫున వీరు ప్రచారం చేయాలన్నది నిర్దేశం. వీరికి ఎలాంటి సొమ్ములు ఇవ్వరు. అయితే.. పార్టీ అధికారంలోకి వచ్చాక మాత్రం మేళ్లు చేస్తామని చెప్పారు. ఈ మేళ్లు ఏంటనేది అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి టికెట్లు ఇస్తారన్న ప్రచారం జరగడమే. ఇది పెద్ద ఎత్తున పార్టీలో చర్చగా మారింది. దీంతో లెక్కకు మించి నియామకాలు చేశారు.
అయితే.. ఇలా ఎంపిక చేసిన గృహ సారథులు కూడా మెజారిటీ మనుషులు టీడీపీ సానుకూలంగా ఉన్నవారినే ఎంపిక చేశారన్నది ఇప్పుడు వైసీపీ చెబుతున్న మాట. ఎందుకంటే.. ఇప్పటికి రెండు సార్లు గృహసారథులతో మాట్లాడేందుకుజగన్ ప్రయత్నించారు.కానీ, ఎవరూ రాలేదు. కొద్ది మాత్రమే గృహ సారథులు ఈ సమావేశానికి మొగ్గు చూపారు. మిగిలిన వారు అసలు ఫోన్లు కూడా స్పందించడం లేదు. దీంతో అసలు వారిని ఎలా ఎంపిక చేశారు? అనేవిషయాన్ని కూపీ లాగారు.
ఈ క్రమంలో మెజారిటీ నియోజకవర్గాల్లో గృహసారథుల నియామకంలోనే అక్రమాలు చోటు చేసుకున్నా యని తెలిసింది. అంటే.. డబ్బులు ఇచ్చి మరీ గృహ సారథులుగా చాలా మంది ఎంపికయ్యారు. వీరికి మరో పార్టీ సహకరించిందని .. ఆ పార్టీనే కొంత మేరకు సొమ్ములు వీరికి చేరవేసి.. గృహ సారథులుగా ఎంపిక అయ్యేలా చేసిందని.. తద్వారా.. ఇంటింటికీ వైసీపీ తరఫున ప్రచారం చేయాలని పేర్కొన్నప్పటికీ.. తమకు ఆర్థికంగా భరోసా ఇచ్చిన పార్టీ తరఫున వారు ప్రచారం చేశారని వైసీపీకి నేతలు గుర్తించారు.
అయితే.. ఇక్కడ తప్పు వైసీపీ నాయకులదే కానీ, గృహ సారథులది కాదని అంటున్నారు. గృహ సారథుల ను ఎంపిక చేసుకునేందుకు వారు కొంత సొమ్ము తీసుకున్నారని.. దీంతో ఎవరు ఎలాంటి వారు అనే విషయాలను గమనించకుండానే వారికి బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. ఇలా ఎంపికైన వారి వెనుక ప్రత్యర్థి పార్టీ నాయకులు ఉన్నారని కూడా చెబుతున్నారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు కామన్‌గానే ఉంటాయి. దీనిని గుర్తించడంలో వైసీపీ విఫలమైంది. అందుకే.. ఇంత భారీ ఎత్తున పరాజయం మూటగట్టుకుందని అంటున్నారు.