Begin typing your search above and press return to search.

వైసీపీ వీళ్ళను భరించాల్సిందేనా ?

వైసీపీ విషయానికి వస్తే పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ ఓటమి తరువాత కూడా చాలా మంది నేతల వైఖరి పార్టీ కొంప ముంచే తీరుగా ఉంది.

By:  Tupaki Desk   |   11 Aug 2024 3:39 AM GMT
వైసీపీ  వీళ్ళను భరించాల్సిందేనా ?
X

వైసీపీ కానీ మరో పార్టీ కానీ ఏ సంస్థ అయినా కానీ సొంత ఇమేజ్ ఉంటుంది. ఒక మనిషిని వ్యక్తిత్వం ఎంత ఇంపార్టెంటో అలాగే ఒక రాజకీయ పార్టీకి కూడా మంచి ఇమేజ్ వ్యక్తిత్వం లాంటిదే. వైసీపీ విషయానికి వస్తే పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ ఓటమి తరువాత కూడా చాలా మంది నేతల వైఖరి పార్టీ కొంప ముంచే తీరుగా ఉంది.

అయినా అధినాయకత్వం ఏ మాత్రం పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. వైసీపీని బదనాం చేసే పని ప్రత్యర్ధులకు ఎందుకు అన్నట్లుగా సొంత వారే చేస్తున్నారు అని అంటున్నారు. అధికారంలో ఉన్నపుడు కొందరు వైసీపీ బడా నేతల మీద ఆరోపణలు వచ్చాయి. గంటా అరగంటా అని ఒకాయన అన్నట్లుగా కూడా టీడీపీ విమర్శలు చేసేది. అలాగే మరొకాయన ఆడియో రికార్డుని కూడా బయట పెట్టింది.

తూచ్ ఇవన్నీ మావి కావు అని వారు ఖండించారు. అధినాయకత్వం వైపు నుంచి చూసే నో రెస్పాన్స్. ఇక వైసీపీ విపక్షంలోకి వచ్చాక పార్టీలో ఒక అగ్ర నేత మీదనే ఆరోపణలు వచ్చి అంతా షాక్ తినేలాంటి పరిస్థితి ఉంది. ఒక మహిళా అధికారిణితో ఆయనకు అంటగట్టారని ఆయన వర్గీయులు కుమిలారు. ఇందులో వాస్తవాలు ఏమిటి అన్నవి తెలియవు కానీ వైసీపీ మాత్రం ఈ రొచ్చులో పడి జనం వద్ద నెగిటివ్ మార్కులే తెచ్చుకుంది.

ఇపుడు లేటెస్ట్ గా శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం. ఆయన మీద ఏకంగా భార్య కుమార్తెలు పోరాడుతున్నారు. ఎవరిది తప్పు అన్నది పక్కన పెడితే ఆయన చెబుతున్న మాటలు తనను తాను సమర్ధించుకుంటూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా సమాజంలోని వారిని అర్ధం కావడం లేదు.

ఇపుడు ఆయన ఒక మహిళతో ఉంటున్నారు అని భార్య దువ్వాడ వాణి ఆరోపణ.దానికి ఆయన జవాబు చెప్పకుండా ఏవే చెబుతున్నారు అని అంటున్నారు. ఇవన్నీ జనాలకు అర్థం కాని విషయాలు. సరే ఆయన వ్యక్తిగతం ఎలా ఉన్నా పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం లో ఇంత రభస సాగుతున్నా పార్టీ కిమ్మనక పోవడం మీదనే చర్చ సాగుతోంది.

ఆయన సొంత ఇబ్బందుల కోసం పార్టీని ఇబ్బందులు పెడుతూంటే దానిని భరిస్తూ పార్టీని బలిపెట్టుకోవాలా అని అంటున్నారు. దువ్వాడ ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. ఆయంకు వైసీపీ 2014 నుంచి అనేక అవకాశాలు ఇచ్చింది. అయినా ఆయన ఓటమి చెందారు. వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆయన వల్ల పార్టీకి ఎంత ఉపయోగమో తెలియదు కానీ ఇపుడు ఆయన వ్యక్తిగత వివాదాల వల్ల వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది అని అంటున్నారు.

గతంలోనూ ఒక ఎంపీ గారు న్యూడ్ వీడియోలు అంటూ వైసీపీలో కలకలం సృష్టించినా పార్టీ ఏమీ పెద్దగా రియాక్ట్ కాలేదు. మనిషిని శీలం నైతికత ఎంత ప్రధానమో పార్టీకి అంతే ప్రధానం అని అంటారు. రాజకీయ పార్టీలు ఏవీ ఆకాశం నుంచి ఊడిపడినవి కావు. అవి కూడా జనంలో నుంచి వచ్చినవే. జనంతో ఉండి రాజకీయాలు చేయాల్సినవే. మేము అన్నింటికీ అతీతులమని అనుకుంటే జనాలు మాత్రం అసలు ఊరుకోరు.

ఇప్పటికే వైసీపీ అయిదేళ్ల అధికార పాలన మీద వెగటు పుట్టి దారుణమైన ఫలితాలను ఇచ్చారు. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా రొచ్చు రోతలతో పార్టీని కంపు చేస్తున్న వారిని ఉపేక్షిస్తూ పోతే వైసీపీకే ఆ గబ్బు అంతా అంటుకుంటుందని అంటున్నారు. దువ్వాడ లాంటి వారి విషయంలో వైసీపీ పెద్దలు చోద్యం చూస్తున్నారా లేక ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అని ఇతర పార్టీలూ ఆసక్తిగా చూస్తున్నాయి.