వలంటీర్లను 'ఓన్' చేసుకుంటారా...!
ఈ క్రమంలో తాము తీసుకువచ్చిన వలంటీర్లను తామే కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
By: Tupaki Desk | 6 Aug 2024 11:30 PM GMTప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న ప్రధాన విషయం.. వలంటీర్లు. వైసీపీ హయాంలో 2019 అక్టోబరులో ఏకంగా 2.30 లక్షల మంది వలంటీర్లను నియమించారు. వీరు దాదాపు ఐదేళ్ల పాటు వైసీపీ నేతల కనుసన్నల్లో తమదే రాజ్యం.. రాజకీయం.. అన్నట్టుగా ముందుకు సాగారు. వీరిని ఇప్పుడు కొనసాగిస్తారా? లేదా? అనే సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు 1.09 లక్షల మంది వైసీపీ నాయకులు చెప్పారని రాజీనామా సమర్పించారు.
అయితే.. అసలు వలంటీర్ల విషయంలో కూటమి సర్కారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. పైగా రాజీనామా లు చేసిన వారిని తీసుకునే ఉద్దేశం కూడా లేదు. దీంతో ఇలాంటి వారు ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో తాము తీసుకువచ్చిన వలంటీర్లను తామే కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అంటే.. రాజీనామాలు చేయకుండా ఉన్నవారిని ప్రభుత్వానికి వదిలేస్తారు. వారు ఎలానూ ప్రభుత్వ పరిధిలో ఉన్నారు.
దీంతో రాజీనామాలు చేసిన వారిలో వారి ఇష్టాన్ని బట్టి.. వైసీపీకి అనుబంధంగా పనిచేయించుకునేందు కు ప్రయత్నం చేస్తున్నారు. వీరికి పార్టీ తరఫున బాధ్యతలు అప్పగించి.. గతంలో ఇచ్చినట్టుగానే నెలకు రూ.5000 చొప్పన ఇచ్చే ఉద్దేశంతో ఉన్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే.. ఇక్కడ కూడా కొంత మార్పు ఉండనుంది. ఇప్పటి వరకు 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉండగా.. వీరిని 100 ఇళ్లకు పెంచుతారు. పార్టీ తరఫున వాయిస్ వినిపించేందుకు వినియోగించుకుంటారు.
గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి సర్కారుకు మధ్య తేడా ను ప్రజలకు పూసగుచ్చినట్టు వివరించే లా వీరికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్టుతెలుస్తోంది. అనంతరం.. వీరి సేవలను వినియోగించుకునేందుకు ప్రాదాన్యం ఇస్తారు. అప్పట్లో కేవలం పాజిటివ్‌గానే వినియోగించుకున్న వైసీపీ.. ఇప్పుడు పాజిటివ్... నెగిటివ్‌గా కూడా వినియోగించుకునేందుకు సిద్ధమవుతోంది. తద్వారా.. తామే తీసుకువచ్చిన వ్యవస్థను తాము రక్షించుకోవాలన్నది జగన్ వ్యూహంగా ఉన్నట్టు చెబుతున్నారు. మరి ఎంత మంది వలంటీర్లు వైసీపీతో నడుస్తారో చూడాలి.