టీడీపీ ఆఫీసుల సంగతేంటి చంద్రబాబు?... లెక్క తీసిన వైసీపీ!
అవును... విశాఖ వైసీపీ కార్యాలయానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషన్ అనుమతులు లేవంటూ టీడీపీ చేసిన విమర్శలకు ఆ పార్టీ ఎక్స్ లో కౌంటర్ ఇచ్చింది.
By: Tupaki Desk | 22 Jun 2024 11:02 AM GMTఆంధ్రప్రదేశ్ లో శనివారం తెల్లవారుజామునే వైసీపీకి భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని ఇవాళ సీఆర్డీయే, ఇతర శాఖల అధికారులు కూల్చివేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. ఇదే సమయంలో విశాఖ ఆఫీసుకూ నోటీసులు అందాయని అంటున్నారు!
ఇందులో భాగంగా... విశాఖలో నిర్మించిన వైసీపీ ఆఫీసుకూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు పంపారు! విశాఖ జిల్లా ఎండాడలో సర్వే నెంబర్ 175/4లో ఉన్న రెండు ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని జీవీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేరున కార్యాలయానికి నోటీసులు అంటించారు!
ఈ విషయాలపై అటు జగన్, ఇటు వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని.. జగన్ ఫైరవ్వగా... ఏపీలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించారు. ఇదే సమయంలో టీడీపీ ఆఫీసుల లిస్ట్ బయటకు తీసింది వైసీపీ.
అవును... విశాఖ వైసీపీ కార్యాలయానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషన్ అనుమతులు లేవంటూ టీడీపీ చేసిన విమర్శలకు ఆ పార్టీ ఎక్స్ లో కౌంటర్ ఇచ్చింది. ఇందులో భాగంగా... కేబినెట్ అనుమతితోనే విశాఖలో వైసీపీ ఆఫీసుకు స్థలం లీజుకు తీసుకున్నట్లు తెలిపింది. అసలు ఈ జీవో ఇచ్చింది గత టీడీపీ ప్రభుత్వమే అని తెలిపింది. అనంతరం "రాష్ట్రవ్యాప్తంగా లీజుతో నడుస్తున్న మీ పార్టీ కార్యాలయాల సంగతేంటి?" అని ప్రశ్నించింది వైసీపీ.
ఈ సందర్భంగా... 2015 - 19 మధ్యకాలంలో లీజ్ బేసిస్ లో టీడీపీ కార్యాలయాల నిర్మాణాలకు స్థలాలు కేటాయించిన వివరాలను వెల్లడించింది. ఈ సందర్భంగా... "మీ కుటిల రాయకీయాలని ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు చంద్రబాబు నాయుడూ" అని ట్విట్టర్ లో పేర్కొంది వైసీపీ.
ఈ క్రమంలోనే... వైఎస్సార్ కడప, శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం, క్రిష్ణ, ప్రకాశం, చిత్తురు జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల నిర్మాణాల నిమిత్తం ల్యాండ్స్ ఎకరం స్థలం సంవత్సరానికి రూ.1000 కి 99 సంవత్సరాలపాటు లీజుకి ఇచ్చారని.. మరికొన్ని చోట్ల చదరపు గజం నెలకు రూ.200 కి 33 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారని చెబుతూ ఒక లిస్ట్ విడుదల చేసింది.