Begin typing your search above and press return to search.

వైసీపీ రీ సౌండ్ : పెన్షన్ నాలుగు వేలు...రైతు రుణ మాఫీ...!

ఇక చివరాఖరుగా మార్చి 3న జరిగే సిద్ధం సభలో రీ సౌండ్ తో మోతెక్కించాలని చూస్తోంది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 3:49 AM GMT
వైసీపీ రీ సౌండ్ : పెన్షన్ నాలుగు వేలు...రైతు రుణ మాఫీ...!
X

ఎన్నికల వేళ ఏపీలో అందరి కంటే ముందే వైసీపీ ఉంది. విపక్షాలు ఇంకా పొత్తుల వద్దనే ఆగిపోయాయి. ఏపీలో సిద్ధం సభలతో వైసీపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికి మూడు రీజియన్లలో సభలను భారీ రేంజిలో నిర్వహించి వైసీపీ తన ఎన్నికల నినాదాన్ని జనం పక్షం చేసింది. ఇక చివరాఖరుగా మార్చి 3న జరిగే సిద్ధం సభలో రీ సౌండ్ తో మోతెక్కించాలని చూస్తోంది.

ఈ నేపధ్యంలో వైసీపీ ఎన్నికల హామీల మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. గతంలో వైసీపీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చింది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నూటికి తొంబై ఎనిమిది శాతం హామీలు తీర్చామని చెబుతున్నారు. హామీలు తీర్చాం కాబట్టే డేరింగ్ గా జనంలోకి వెళ్తున్నామని కూడా అంటున్నారు.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి రావడానికి జగన్ పాదయాత్రతో పాటు ఎన్నికల ప్రణాళిక కూడా ఒక కారణం అని అంటున్నారు. ఇపుడు తాము దాదాపుగా అన్ని హామీలూ నెరవేర్చాం కాబట్టి ఈసారి మరింత ధీమాగా కొత్త పధకాలతో జనంలోకి వెళ్తామని అంటున్నారు.

గత ఎన్నికల్లో సామాజిక పెన్షన్లను మూడు వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పిన జగన్ అలాగే 2024 ఎన్నికల నాటికి వాటికి మూడు వేలకు పెంచారు. ఈసారి ఆ సామాజిక పెన్షన్లనే మరోసారి ఎన్నికల హామీగా వైసీపీ చేసుకుంటోంది. మరోసారి వైసీపీని గెలిపిస్తే సామాజిక పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని వైసీపీ బ్రహ్మాస్త్రం లాంటి హామీ ఇవ్వబోతోంది అని అంటున్నారు.

ఏపీలో వృద్ధులు సమాజిక పెన్షన్ పొందే వారు లక్షలలో ఉన్నారు. వారి ఓట్లు అన్నీ కొల్లగొట్టేందుకే ఈ హామీ అని అంటున్నారు. ఇక దశల వారీగానే ఈ హామీని నెరవేరుస్తారు కాబట్టి ఖజానాకు ఆర్ధికంగా పెద్ద ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

అదే విధంగా మరో కీలక హామీని కూడా జగన్ ఇవ్వబోతున్నారు అని అంటున్నారు. అదే రైతులకు రుణ మాఫీ. ఇది జగన్ నోటి వెంట రావడం ఖాయం అని అంటున్నారు. అయితే ఎంత సీలింగ్ పెట్టాలి అన్న దాని మీదనే ప్రస్తుతం చర్చ సాగుతోంది. రెండు లక్షల దాకా ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వాలా మొత్తం రుణాలను మాఫీ చేస్తమని హామీ ఇవ్వాలా అన్న దాని మీదనే కసరత్తు సాగుతోందిట. ఆర్ధిక పరిస్థితులను కూడా బేరీజు వేసుకుని ఈ హామీకి తుది రూపు దిద్దుతారు అని అంటున్నారు.

ఈ హామీని 2014లో టీడీపీ ఇచ్చి లబ్ది పొందింది. అయితే పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. జగన్ ఆనాడు ఈ హామీని ఇవ్వలేను అని అన్నారు. ఇపుడు అయిదేళ్ళు విపక్ష నేతగా మరో అయిదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్ కి అనుభవం వచ్చిందని, ఖజానకు ఎంత సొమ్ము వస్తుంది అప్పులు ఎలా వస్తాయి ఎలా ఆర్ధికంగా భరోసాగా ఉండవచ్చు అన్న లెక్కలు అన్నీ చూసుకుని మరీ ఈ హామీని ఇవ్వబోతున్నారుట. దీనికి టైం బాండ్ పెట్టి మరీ రైతులకు రుణ మాఫీని అమలు చేయబోతున్నారు అని అంటున్నారు.

దీని వల్ల లక్షలాది రైతు కుటుంబాలు వైసీపీ వైపు పూర్తి స్థాయిలో మళ్ళుతాయని అంటున్నారు. ఇంకో వైపు మహిళలకు కూడా హామీలు మరిన్ని ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. ఏమి చెప్పినా చేస్తారు అన్న నమ్మకం వైసీపీకి ఉంది కాబట్టి ఈ హామీలతో మరోసారి అధికారం అందుకోవచ్చు అన్నదే జగన్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు.