Begin typing your search above and press return to search.

వైసీపీ స్టార్ కాంపెనియర్లు రెడీ... న్యూ కాన్సెప్ట్ తో...!?

ఏపీలో విపక్షం నుంచి చూస్తే చాలా మంది స్టార్ కాంపెనియర్లు ఉన్నారు అని చెప్పాలి

By:  Tupaki Desk   |   17 Dec 2023 1:30 PM GMT
వైసీపీ స్టార్ కాంపెనియర్లు రెడీ... న్యూ కాన్సెప్ట్ తో...!?
X

ఏపీలో విపక్షం నుంచి చూస్తే చాలా మంది స్టార్ కాంపెనియర్లు ఉన్నారు అని చెప్పాలి. ముందుగా టీడీపీ విషయం తీసుకుంటే చంద్రబాబుకు తోడుగా చినబాబు లోకేష్ ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ పుణ్యమాని ఆయన సతీమణి భువనేశ్వరి కూడా జనంలోకి వచ్చేశారు. అలా ఆమె కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలోకి రావచ్చు. అదే విధంగా నారా బ్రాహ్మణి కూడా బాబు అరెస్ట్ జైలు నేపధ్యంలో ప్రజలతో కనెక్ట్ అయ్యారు. అలా ఆమె కూడా టీడీపీ స్టార్ కాంపెనియర్ గా ఉండవచ్చు. వీటికి మించి సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ ఎటూ ఉన్నారు.

సో టీడీపీకి సకుటుంబ సపరివార సమేతంగా ప్రచారం చేయడానికి పెద్ద లిస్ట్ ఉంది. జనసేనకు పవన్ కళ్యాణ్ ని మిచిన స్టార్ వేరొకరు లేరు. ఆయనతో పాటు అన్న నాగబాబు ఎటూ ఉంటారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి కూడా కొందరు ఈసారి జనసేన ప్రచారంలో పాల్గొనవచ్చు అని కూడా అంటున్నారు.

జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ కి రాహుల్ ప్రియాంకా స్టార్ కాంపెనియర్లుగా ఉంటారు. తెలంగాణా నుంచి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా హస్తం పార్టీకి అతి పెద్ద ఆకర్షణ అవుతారు. బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు మోడీ అమిత్ షా వంటి వారు కొందరు కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారం చేస్తారు.

మరి అధికార వైసీపీకి స్టార్ కాంపెనియర్లు ఎవరు అన్నది కీలకమైన ప్రశ్న. ఆ విధంగా చూస్తే జగన్ తప్ప ఎవరూ కనిపించడంలేదు. 2019 ఎన్నికల్లో జగన్ తో పాటు ఆయన సోదరి షర్మిల, అలాగే మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఏపీ నలు చెరగులా వైసీపీ జెండాను రెపరెపలాడించారు. కానీ ఈసారి అలా జరిగే అవకాశం అయితే లేదు వైఎస్సార్టీపీ పేరిట షర్మిల పార్టీని ఏర్పాటు చేసారు. ఇక విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

మరి అధికార పార్టీ తరఫున జగన్ ఒక్కరే ప్రచారం చేయగలరా పైగా ఆయన సీఎం కొన్ని పరిమితులకు లోబడి ప్రచారం చేయాల్సి ఉంటుంది. పాలన కూడా చూసుకోవాలి. మరి వైసీపీ తరఫున ఎవరు అంటే దాని మీదనే ఆ పార్టీ కసరత్తు చేస్తోంది అని అంటున్నారు. వైసీపీలో కొందరు ఫైర్ బ్రాండ్ నేతలు ఉన్నారు. వారు ఏపీవ్యాప్తంగా జనాలకు తెలుసు. పైగా తమదైన మాటలతో అట్రాక్ట్ చేయగలరు. ప్రత్యర్ధుల విమర్శలను ఎప్పటికపుడు తిప్పికొడుతూ కార్నర్ చేయగలరు.

అలాంటి వారి జాబితాను ఇపుడు వైసీపీ సీరియస్ గా పరిశీలిస్తోంది అని అంటున్నారు. వారిలో కొందరిని పూర్తిగా ఎన్నికల ప్రచారానికే వాడుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. వారిని ఎన్నికల్లో పోటీ చేయించి కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం చేయకుండా ఏపీవ్యాప్తంగా ప్రచారం చేయించాలని చూస్తోంది అని అంటున్నారు.

ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి సముచిత గౌరవం కల్పించాలని వైసీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు. అలాంటి ఫైర్ బ్రాండ్ లీడర్స్ జాబితాలో మహిళా నాయకులు కూడా ఉన్నారని అంటున్నారు. అలాగే ఇటీవలే వైసీపె యువజన మహిళా విభాగాలను పునర్ వ్యవస్థీకరించింది. అందులో కూడా మంచి వాగ్దాటి ఉన్న వారిని ఎంపిక చేసింది. వారంతా కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం పెద్ద ఎత్తున చేస్తారు అని అంటున్నారు.

అదే విధంగా ఇప్పటికే గడప గడపకు అంటూ వైసీపీ ఇంటింటి ప్రచారంలో ముందుంది. అలాగే కొందరు సీనియర్ నేతలకు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించి ఆయా రీజియన్లో వారి చేత ప్రచారాలు చేయించాలని వ్యూహాలను రూపొందిస్తోంది అని అంటున్నారు. అలాగే సామాజిక సమీకరణలు కూడా చూసుకుని మరీ ఆయన జిల్లాలలో ఎవరు ప్రచార బాధ్యతలు చూస్తే బాగుంటుంది అని కూడా వైసీపీ ఆలోచించి మరీ ఎంపిక చేయనుంది అంటున్నారు.

మొత్తానికి ఈసారి వైసీపీ ప్రచార బాధ్యతలను వికేంద్రీకరించింది అని అంటున్నారు. టాప్ లెవెల్ లో కాకుండా జిల్లా స్థాయి దాకా ప్రచార వ్యూహాలను ఖరారు చేయడం ద్వారా జనాలకు మరింత దగ్గర కావాలని అనుకుంటోంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత వైఎస్ జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రతీ జిల్లాలోని ముఖ్య నియోజకవర్గాలను టచ్ చేస్తారని ఆ విధంగా వైసీపీ ప్రచార పర్వం వినూత్నంగా సాగుతుందని అంటున్నారు.