టాలీవుడ్‌పై వైసీపీ సూపర్ స్ట్రాటజీ.. టీడీపీ లెక్కలివే...!
దిగ్గజ దర్శకుడు వీవీ వినాయక్ సహా నటుడు అలీలకు వైసీపీ పార్లమెంటు స్థానాలు ఇస్తున్నట్టు సమాచారం.
By: Tupaki Desk | 11 Jan 2024 10:00 AM GMTతెలుగు సినిమా రంగం ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికల్లో ఈ రంగానికి సంబంధించిన ప్రముఖులకు ఎంత మందికి టికెట్లు ఇస్తున్నారు? ఎవరెవరు పోటీలో ఉండను న్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయంలో వైసీపీ దూకుడుగా ఉందనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దిగ్గజ దర్శకుడు వీవీ వినాయక్ సహా నటుడు అలీలకు వైసీపీ పార్లమెంటు స్థానాలు ఇస్తున్నట్టు సమాచారం.
దీనికి సంబంధించి వైసీపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని.. వీవీ వినాయక్ కోసం.. రాజమండ్రి పార్లమెంటుస్థానాన్ని ఖాళీ చేయించారని పార్టీలో చర్చ సాగుతోంది. తాజాగా విడుదల చేయనున్న మూడో జాబితాలో ఆయన పేరు ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇక, ఇప్పటి వరకు కోస్తా జిల్లాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన హాస్య నటుడు అలీకి సీమ ప్రాంతంలోని కీలకమైన పార్లమెంటు స్తానం ఇస్తున్నట్టు చెబుతున్నారు.
మైనారీ ముస్లింలు ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలోని ఒక పార్లమెంటు స్థానం నుంచి అలీని నిలబెడతార ని సమాచారం. అదేవిధంగా.. ఈ దఫా మంచు కుటుంబానికి కూడా ప్రాధాన్యం దక్కుతుందని అంటున్నా రు. అయితే.. దీనిపై చర్చ సాగుతోంది కానీ.. మంచు కుటుంబం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇదిలా వుంటే.. మరి టీడీపీ మాటేంటి? అనే చర్చ కూడా తెరమీదికి వస్తోంది. ఆది నుంచి సినీ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్న టీడీపీ ఈ దఫా ఎంత మందికి ఛాన్స్ ఇవ్వనున్నది? అనేది తేలాల్సి ఉంది.
ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ ఒక్కరే హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రాజమండ్రి స్థానం నుంచి మురళీ మోహన్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత.. ఆయన కోడలు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారా? లేక వేరేవారిని తీసుకువస్తారా? అనేదిచర్చ గా మారింది. వీరితో పాటు మరో ఇద్దరు కూడా.. టీడీపీలో టికెట్లు ఆశిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. ముఖ్యంగా మాటల రచయిత పరచూరి గోపాల కృష్ణ కూడా పార్టీలో ఏదో ఒక పదవి ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.