Begin typing your search above and press return to search.

వైసీపీలో ఆరు సర్వేలు....తేల్చిందేటంటే...?

దసరా నాటికి మొత్తం 175 అభ్యర్ధులకు సంబంధించి జాబితాను రెడీ చేసి పెట్టుకోవాలని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 12:30 AM GMT
వైసీపీలో ఆరు సర్వేలు....తేల్చిందేటంటే...?
X

వైసీపీలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్ధుల కంటే ముందుగానే అన్ని విషయాలలోనూ వైసీపీ దూకుడు చేస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీ ఐ ప్యాక్ టీం సర్వేను నమ్ముకుంది. అంతే కాదు ఇంటలిజెన్స్ సర్వేను కూడా మరో వైపు చేయిస్తోంది. ఈ రెండు సర్వేలతో పాటుగా మరో నాలుగు సర్వేలు సమాంతరంగా సాగుతున్నాయి. ఈ సర్వే నివేదికలు ఎప్పటికపుడు వైసీపీ అధినాయకత్వానికి అందుతున్నాయట.

అన్ని సర్వేలను క్రోడీకరించి వైసీపీ అధినాయకత్వం రూపొందించిన సమగ్రమైన సంపూర్ణమైన నివేదికలో ఆసక్తికరమైన ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద కొందరు మంత్రులతో పాటు 36 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు బాగులేదని ఈ నివేదిక తేల్చిందని అంటున్నారు.

మరి పనితీరు బాగులేని వారు ఎవరు అన్నదే ఇపుడు ప్రశ్నగా ఉంది. వారి విషయంలో వివరాలు సదరు ఎమ్మెల్యేలకు తెలియచేసి ఉంటారనే అంటున్నారు. ఇక వీరికి అఖరి చాన్స్ అన్నట్లుగా అక్టోబర్ లోగా పనితీరుని మెరుగుపరచుకోకపోతే మాత్రం టికెట్ హుళక్కే అని అంటున్నారు. ఆనాటికి వచ్చే ఈ సర్వే నివేదికలే ఫైనల్ అని వైసీపీ హై కమాండ్ స్పష్టం చేస్తోందిట.

దసరా నాటికి మొత్తం 175 అభ్యర్ధులకు సంబంధించి జాబితాను రెడీ చేసి పెట్టుకోవాలని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది అని అంటున్నారు. మరో వైపు చంద్రబాబు కూడా జనసేనతో పొత్తు అన్నది పక్కన పెట్టి మరీ ఎంత వీలైతే అంత పెద్ద నంబర్ తో తొలి జాబితాను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. దానికి ఆయన ఎంచుకున్న ముహూర్తం దసరా అని అంటున్నారు.

దసరా నాటికి బాబు ముందు తన జాబితా రిలీజ్ చేస్తారా లేక జగన్ రిలీజ్ చేస్తారా అన్నది ఇపుడు రాజకీయంగా మరో ఇంటరెస్టింగ్ మ్యాటర్. అయితే ఎవరి ముందు రిలీజ్ చేసినా రెండవవారు సర్దుకుని ఆయా సీట్లలో మార్పు చేర్పులు చేసుకుంటారా అన్నది మరో చర్చనీయాంశం. అయితే జగన్ వరకూ చూసుకుంటే తాను అనుకున్న మేరకు అభ్యర్ధులను ప్రకటిస్తారు అనే అంటున్నారు. ఒకసారి ఫిక్స్ అయిన తరువాత మార్పుచేర్పులు ఉండవని అంటున్నారు. పైగా తొలి జాబితా రెండవ జాబితా అన్నది కాకుండా టోటల్ గా 175 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించి జనంలో ఉంచుతారని అంటున్నారు.

అయితే ఇపుడు తేలాల్సిన విషయం ఏంటి అంటే పనితీరు బాగులేని 36 మందిలో ఎంతమంది దసరా నాటికి సెట్ అవుతారు అన్నది. అలా సెట్ కాని వారికి ముందే చెప్పినట్లుగా టికెట్ కట్ చేస్తారా. అలా అయితే దసరా నాటికి ఎంతమంది టికెట్ దక్కని వారి జాబితాలో ఉంటారు అనంది వైసీపీలో సీరియస్ మ్యాటర్ గా ఉంది. ఏ విధంగా చూసుకున్నా పాతిక మందికి తక్కువ లేకుండా వైసీపీ సిట్టింగులకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చు అన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే మాత్రం వారంతా వైసీపీకి విధేయులుగా ఉంటారా లేక పార్టీని వీడి వేరే దారి చూసుకుంటారా అన్నది కూడా చూడాల్సి ఉంది.

ఏది ఏమైనా ఏపీలో విజయదశమి అయిదు కోట్ల మందికి పండుగగా ఉంటే వైసీపీ టీడీపీలకు మాత్రం యమ టెన్షన్ ని పెంచే పండుగగా మారుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఎవరి జాతకాలు ఏంటి అన్నది ఈసారి విజయదశమి తేల్చేస్తుందేమో.