Begin typing your search above and press return to search.

అసెంబ్లీ సమావేశాలపై జగన్ మరో కీలక నిర్ణయం!

ఈ రోజు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టారు.

By:  Tupaki Desk   |   22 July 2024 8:22 AM GMT
అసెంబ్లీ సమావేశాలపై జగన్  మరో కీలక నిర్ణయం!
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అడ్డుకున్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును... ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నల్లకండువాలతో ఎంట్రీ ఇచ్చిన జగన్... మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఏపీ అసెంబ్లీ సమావేశాలపై నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్ కు గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో... మంగళ, బుధ వారాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాలకూ హాజరుకాకూడదని నిర్ణయించారు!

మరోపక్క స్పీకర్.. శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యవుల కేశవ్ హాజరవ్వగా... జనసేన నుంచి మంత్రి నాదేండ్ల మనోహర్, బీజేపీ తరుపుణ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.

ఇక ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏయే అంశాలపై చర్చించాలనే అంశాలపై బీఏసీ సమావేశంలో నిర్ణయాలు తీసుకోన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు... ఈ నెల 26 వరకూ... అంటే, ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారని తెలుస్తోంది.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం రేపు సభలో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. ఇదే సమయంలో... గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితి, ఎక్సైజ్ విధానంతో పాటు శాంతిభద్రతలపైనా శ్వేతపత్రాలను విడుదల చేయనుందని సమాచారం. దీంతో... వీటిపై సభ్యులు చర్చించే అవకాశం ఉంది!