వైసీపీపై ఒత్తిళ్లు.. తెలంగాణ ప్రచారానికి పిలుపు..!
అయితే, తెలంగాణలో ప్రచారంపై ఇంకా వైసీపీ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెళ్లాలా? వద్దా.. అనేది పార్టీ అధినేతకు వదిలేశారట.
By: Tupaki Desk | 22 Nov 2023 3:15 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. అధికార పార్టీ బీఆర్ ఎస్.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ల మధ్య పోరు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఎవరికి వారు.. తమ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కీలక నేతలను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వంటివారు ప్రచారంలో పాల్గొన్నారు.
ఇక, రానున్న రోజుల్లో సీఎం సిద్దరామయ్య కూడా తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్న ట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీఆర్ ఎస్ కూడా.. తనకు అనుకూలంగా ఉన్న వర్గాలను రంగంలోకి దింపేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఏపీ అధికార పార్టీ వైసీపీలోని కొందరునాయకులను, ముఖ్యంగా హైదరాబాద్‌లోని సెటిలర్లను ప్రభావితం చేయగల నాయకులను రంగంలోకి దింపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి నాయకులను పంపించాలంటూ.. పైస్థాయిలో ఫోన్లు వస్తున్నాయనేది ప్రధాన వర్గాల సమాచారం. మంత్రులుగా ఉన్న ఒకరిద్దరికి.. తెలంగాణతో అనుబంధం ఎక్కువగా ఉండడం.. రాష్ట్రస్థాయి నాయకులుగా ప్రచారం ఉండడం నేపథ్యంలో వారిని వినియోగించుకుని తెలంగాణలో ప్రచారం చేయించుకోవాలని బీఆర్ ఎస్ భావిస్తోంది. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లోతాము కూడా ఇదే సాయం చేస్తామన్న విధంగా చెబుతున్న నేపథ్యంలో వైసీపీపై ఒత్తిడి పెరిగిందని అంటున్నారు.
అయితే, తెలంగాణలో ప్రచారంపై ఇంకా వైసీపీ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెళ్లాలా? వద్దా.. అనేది పార్టీ అధినేతకు వదిలేశారట. ఇక, సామాజిక వర్గాల పరంగా చూస్తే.. రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు వైసీపీ ముఖ్యనేతలు ప్రయత్నించేలా కూడా బీఆర్ ఎస్ నుంచి ఒత్తిడి పెరిగిందని.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. రెడ్డి సామాజిక వర్గాన్ని తమకు అనుకూలంగా తిప్పాలని కోరుతున్నట్టు ప్రచారం అయితే.. జరుగుతోంది. అయితే, దీనిపై వైసీపీ వచ్చే రెండు మూడు రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.