మందుబాబులకు దసరా కిక్కు మంచి బ్రాండ్ తో లక్కు !
కానీ వారి మనో వేదన మందు వేదన వైసీపీకి ఉసురుగా తగిలి టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఆయుష్షును అధికారాన్ని అందించింది.
By: Tupaki Desk | 7 Aug 2024 6:33 PM GMTపురుషులందు పుణ్య పురుషులు వేరయా అని ఆనాడు వేమన అన్నాడు. నిజమే అందరిలోనూ కొందరు ఉంటారు. ఆ కొందరి కోసం కూడా ఆలోచించాలి కదా. మందు బాబులు కూడా ఒక ప్రత్యేక కేటగిరీ ఓటర్లు అని 2024 ఎన్నికల వరకూ ఎవరికీ తెలియదు. కానీ వారి మనో వేదన మందు వేదన వైసీపీకి ఉసురుగా తగిలి టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఆయుష్షును అధికారాన్ని అందించింది.
మందు తాగడం అన్నది ఒక వ్యసనం. కానీ అది చాలా చోట్ల కల్చర్ గా మారింది. డబ్బున్న వారు పబ్బులలో తాగితే అది గొప్పగా ఉంటే పేదలు ఇతర వర్గాలు మందు తాగితే తప్పేంటి అని లాజిక్ తో కూడిన ప్రశ్నలు కూడా వేసే వారు ఉన్నారు. సామాజిక రుగ్మతగా మందు వ్యసనం ఉన్న స్థాయి నుంచి ఆదాయంగా రాష్ట్రాలకు అది మారడం విశేషమే కాదు విషాదం కూడా.
మద్యపాన నిషేధాన్ని పకడ్బంధీగా అమలు చేద్దామని ప్రయత్నించిన స్వర్గీయ ఎన్టీఆర్ చివరికి తన ప్రభుత్వాన్ని ఫణంగా పెట్టాల్సి వచ్చింది అన్నది ఉమ్మడి ఏపీలో ఒక చరిత్రగా ఉంది. అందువల్ల కొన్ని విషయలలో నో అని చెప్పకుండా వారి బాటలో నడిస్తే ఓట్లకి ఓట్లూ సీట్లకి సీట్లు. అందుకే 1994 ఎన్నికల్లో సంపూర్ణ మద్య పాన నిషేధం అని ఎన్టీఆర్ నాయకత్వంలోని టీడీపీ ఎన్నికలకు వెళ్ళి ఘన విజయం సాధిస్తే మూడు దశాబ్దాలు గిర్రున తిరిగేసరికి మంచి మద్యం మీకు అందిస్తాం మాకు అధికారం ఇవ్వండి అని అదే టీడీపీ ఓటర్లకు హామీ ఇచ్చి అధికారం తెచ్చుకోవడం అంటే రాజకీయాలు అంటే ఇవే కదా అని అనిపించక మానదు.
ఇక జగన్ విషయం తీసుకున్నా సంపూర్ణ మధ్య నిషేధం అని చెప్పలేదు కానీ దశలవారీగా మద్య నిషేధం అని అన్నారు. అది మహిళలకు నచ్చింది కానీ పురుషులకు నచ్చలేదు. అయినా వైసీపీ 2019లో ఒక ప్రభంజనంలో అధికారంలోకి వచ్చింది. అయితే అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో అన్ని తప్పుల కంటే పెద్ద తప్పు మద్యం పాలసీ విషయంలోనే జరిగింది అని అంటారు.
ప్రైవేట్ వారికి వేలం పాటలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే తాను మద్యం దుకాణాలను నడిపి అభాసుపాలు అయింది. పోనీ ఆ నడిపింది మంచి బ్రాండ్ల మద్యంతో కాదు ఏవేవో కొత్త పేర్లతో మద్యాన్ని దించింది. దాంతో పాటు ధరలు దారుణంగా పెంచింది. ఇక కిక్కు దిగిపోయి మందుబాబులు వైసీపీ మీద మండిపోయారు.
మద్య పాన నిషేధం దశలవారీగా అని గద్దెనెక్కిన ప్రభుత్వం అయిదేళ్లలో ఆ పని చేయకపోవడంతో మహిళలు కూడా రూట్ మార్చారు. అన్నీ వెరసి వైసీపీని ఓడించాయి. ఇదంతా ఒక చరిత్ర అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలలో అతి ముఖ్యమైన మందుబాబులకు తక్కువ ధరలలో నాణ్యమైన మంచి బ్రాండ్ల మందును అందించడానికి ముహూర్తం నిర్ణయించడం.
కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించి అమలు చేస్తామని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలియచేశారు. కొత్త మద్యం పాలసీ తో కల్తీ మద్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం కేవలం ఆదాయం పెంచుకోవడానికే కల్తీ మద్యాన్ని విక్రయించి ఎందరో ప్రాణాలు పోవడానికి కారణం అయింది అని ఆయన ఆరోపించారు.
పాత మద్యం బ్రాండ్లను మళ్లీ తీసుకుని వస్తామని ఆయన అన్నారు. అదే సమయంలో మద్యం ఆదాయం కంటే తమకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని అన్నారు. అంటే మంచి బ్రాండ్లతో ప్రాణాలు నిలుస్తాయని మంత్రి గారి భావన. అయితే మంచి బ్రాండ్ల వల్ల ప్రాణం తొందరగా పోదు, మెల్లగా సైలెంట్ కిల్లర్ గా మరి కొన్నాళ్ళ తరువాత పోతుంది.
కల్తీ మద్యం వల్ల వెంటే పోతుంది. వైసీపీ వచ్చి మద్యం పాలసీ మార్చి చేసిన ఉపకారం ఏమిటి అంటే పాత మద్యం పాలసీ బెటర్ అని. ఇది మహిళా లోకం సైతం ఒప్పుకునేలా చేసింది. అందుకే ధైర్యంగా కొత్త ప్రభుత్వం మంచి మద్యం పాలసీ అంటోంది. మంచి మందు అంటోంది. మందు తాగడం తప్పు అది ప్రాణ హాని అయినపుడు మంచి ఏమిటి. కానీ ఇక్కడే ఉంది రాజకీయం. అది వైసీపీ పెద్ద గీత గీసి మందు బాబుల పట్ల పెంచిన సానుభూతి రాజకీయం. సో ఇపుడు మంచి మద్యం బ్రాండ్లు వస్తాయి. అవి కూడా దసరా ముందు వస్తాయి. దాంతో ఈసారి ఏపీలో దసరా కిక్కు ఓ రేంజిలో ఉంటుంది అన్న మాట. మందు బాబులదే ఈ సారి దసరా సరదా అన్న మాట.