'కుప్పం కథ' సెకండ్ పార్ట్ స్టార్టయిందా?!
అంతేకాదు.. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని పలువురు వైసీపీ నాయకులు శపథం కూడా చేశారు.
By: Tupaki Desk | 25 July 2024 8:30 AM GMTకుప్పం- ఏపీ సీఎం చంద్రబాబు గత 40 ఏళ్లుగా విజయం దక్కించుకుంటున్న నియోజకవర్గం. ఇది 35 ఏళ్లుగా ఎలాంటి వివాదానికి గురి కాలేదు. నిశ్శబ్దంగా రాజకీయాలు సాగిపోయాయి. కానీ, 2019 తర్వాత.. గడిచిన ఐదేళ్లు మాత్రం కుప్పం కేంద్రంగా జరగని రాజకీయం అంటూ లేదు. అప్పటి వైసీపీ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గాన్ని సీరియస్‌గా తీసుకుంది. అంతేకాదు.. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని పలువురు వైసీపీ నాయకులు శపథం కూడా చేశారు.
అయితే.. తాజా ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారు. అది వేరే సంగతి! ఇక, వైసీపీ నాయకులు ఎన్ని ప్రయ త్నాలు చేసినా.. కుప్పం ప్రజలు బాబుకే జై కొట్టారు.. ఇది మరో సంగతి!! అయితే.. `కుప్పం కథ` అక్కడితో అయిపోయిందని అందరూ భావించారు. ఎందుకంటే.. వైసీపీ చేసిన శపథం పోయింది.. చంద్రబాబు గెలిచేశారు.. పైగా.. వైసీపీకి నామరూపాలు లేని విధంగా ప్రజలు బుట్టదాఖలు చేశారు. కాబట్టి.. ఈ కథ అక్కడితో అయిపోయిందని అందరూ అనుకున్నారు.
కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. అసలు కుప్పం కథలో సెకండ్ పార్ట్ ఇప్పుడే మొదలైందని అంటున్నారు టీడీపీ నాయకులు. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించే బాధ్యతలను అప్పటి ముఖ్యమంత్రి జగన్.. పార్టీ సీనియర్ నాయకుడు.. చంద్రబాబుకు బద్ధ విరోధి(ఇద్దరూ క్లాస్‌మేట్స్ అంటారు)..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారనే విషయం తెలిసిందే. దీంతో పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గం పుంగనూరు కంటే కూడా.. కుప్పంలోనే ఎక్కువగా ఉన్నారు.
ఎలాగైనా.. ఏం చేసినా.. చంద్రబాబు ఓటమిని కళ్ల చూడాలని పెద్దిరెడ్డి కలలు కన్నమాట వాస్తవం. అందుకే.. కుప్పం నుంచి పోటీ చేసిన భరత్ తేజకు ఆర్థికంగా కూడా పెద్దిరెడ్డి సాయం చేశారని అప్పట్లో గుసగుస వినిపించింది. అంతేకాదు.. కుప్పంలో ఈ ఏడాది ఎన్నికలకు ముందు.. టీడీపీ జెండా మోసేం దుకు కూడా నాయకులు కరువయ్యే పరిస్థితి తీసుకువచ్చారు. ఇలా కుప్పాన్ని టార్గెట్ చేసుకుని.. చంద్రబాబును ఓడించేందుకు కంకణం కట్టుకున్న పెద్దిరెడ్డిని ఇప్పుడు అదే బాబు టార్గెట్ చేస్తున్నారనేది టీడీపీ మాట.
పుంగనూరు పరిధిలోని మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకోవడం.. అక్కడి భూముల పత్రాలు తగలబడడాన్ని అత్యంత సీరియస్‌గా విచారణకు ఆదేశించడం నేరుగా డీజీపీని, సీఐడీ చీఫ్‌ను కూడా పంపించడం వంటి పరిణామాలను తమ్ముళ్లు భేరీజు వేస్తున్నారు. కుప్పం కధ సెకండ్ పార్ట్ స్టార్టయిందని.. పెద్దిరెడ్డి బాగోతాలను వెలికి తీయడం ఖాయమని.. ఆయనకు చెక్ పెట్టడమే.. కుప్పం కథలో క్లైమాక్స్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరుటీడీపీ నాయకులు ఈ విషయంపైనే ఎక్కువగా చర్చించుకోవడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.