అర్బన్ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్... వైసీపీ గేమ్ ప్లాన్ ఏంటి...!
"గ్రామ స్థాయిలో పరిస్తితి బాగానే ఉంది. కానీ, అర్బన్ ఓటు బ్యాంకు మాత్రం మాకు ఇబ్బందిగానే ఉంది" - ఏ వైసీపీ నాయకుడిని పలకరించినా ఇదే మాట వినిపిస్తోంది.
By: Tupaki Desk | 4 Feb 2024 3:30 PM GMT"గ్రామ స్థాయిలో పరిస్తితి బాగానే ఉంది. కానీ, అర్బన్ ఓటు బ్యాంకు మాత్రం మాకు ఇబ్బందిగానే ఉంది" - ఏ వైసీపీ నాయకుడిని పలకరించినా ఇదే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో 540కిపైగానే గ్రామాలు ఉన్నాయి. వీటికి తండాలు అదనం. ఆయా గ్రామాలు తండాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు... సంక్షేమం వంటివి బాగానే చేరుతున్నాయి. ప్రతి నెలా 1న ఉదయాన్నే పింఛన్లు అందుతున్నాయి. వలంటీర్లు చేరువలోనే ఉంటున్నారు. రేషన్ సహా.. వైద్యం కూడా చేరువ అయింది.
దీంతో గ్రామీణ, తండాల్లోని ఓటు బ్యాంకు తమకు అనుకూలంగానే ఉందని వైసీపీ నిర్ణయించుకుంది. వారికి అందుతున్న సంక్షేమం.. సీఎం జగన్‌పై పెరిగిన సానుభూతి.. వంటివి వర్కవుట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇదేసమయంలో అర్బన్ విషయానికి వస్తే.. మాత్రం వైసీపీ మైనస్‌లు ఎక్కువగా ఉన్నాయి. రహదారులు లేకపోవడం.. అభివృద్ధి, పరిశ్రమలు, నిరుద్యోగం., ధరలు వంటివి పెను ప్రభావం చూపించే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు.
అంటే.. మొత్తంగా గ్రామీణ స్థాయి ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉండగా.. పట్టణ, నగర ఓటు బ్యాంకు మాత్రం తేడా కొడుతోంది. అయితే.. ఇక్కడ కూడా.. మహిళలు తమకు అనుకూలంగానే ఉంటారని వైసీపీ అంచనా వేస్తోంది. అమ్మ ఒడి, చేదోడు, ఆసరా, ఇళ్లు వంటి కీలక పథకాలు.. నగరాల్లోని వారికి కూడా అందుతున్నాయని.. కాబట్టి మహిళలు తమతోనే ఉంటారని వైసీపీ లెక్కలు కట్టింది. కానీ, గ్రామీణ స్థాయిలో ఉన్నంత అనుకూలత అయితే.. నగరంలో కనిపించడం లేదు.
పైగా పథకాల విషయం ఎలా ఉన్నా..ఎన్నికల సమయానికి వివిధ పార్టీల ప్రచారం ద్వారాప్రభావితం అయ్యేది కూడా నగర ఓటరే. ఆ సమయానికి ఏ సెంటెమెంటు ఉన్నా.. ఇక్కడ ప్రభావం చూపుతుంది. అదే ఇప్పుడు వైసీపీకి ఆలోచనగా మారింది. గ్రామీణ ఓటు బ్యాంకు కన్నా.. పట్టణ జనాభా పెరుగుతున్న దరిమిలా.. ఇక్కడి ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు కుస్తీలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ప్రవేశ పెట్టే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో నగర వాసలపై వరాలు కురింపే అవకాశం ఉంటుందనే చర్చ తెరమీదికి వచ్చింది.