Begin typing your search above and press return to search.

వైసీపీకి ఆ సీటు యమ తలనొప్పిగా మారిందా...?

కానీ వైసీపీకి మాత్రం విశాఖలో ఒక సీటు బిగ్ ట్రబుల్ ఇస్తోంది. అదే విశాఖ సౌత్. అక్కడ వైసీపీ గత రెండు ఎన్నికల్లోనూ గెలిచింది లేదు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 3:00 AM GMT
వైసీపీకి ఆ సీటు యమ తలనొప్పిగా మారిందా...?
X

అధికారంలో ఉన్న పార్టీకి తలనొప్పులు తక్కువగా ఉంటాయి. కానీ వైసీపీకి మాత్రం విశాఖలో ఒక సీటు బిగ్ ట్రబుల్ ఇస్తోంది. అదే విశాఖ సౌత్. అక్కడ వైసీపీ గత రెండు ఎన్నికల్లోనూ గెలిచింది లేదు. 2014లో కోలా గురువులు పోటీ చేసి ఓడితే, 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలు అయ్యారు.

ఈ రెండు సార్లూ టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ని వైసీపీలోకి తీసుకుని వచ్చారు. ఆయన గత మూడేళ్ళుగా వైసీపీ ఎమ్మెల్యేగానే ఉంటున్నారు. ఇక ఆయనే 2024లో వైసీపీ నుంచి పోటీ చేస్తారు అని ఆయనతో పాటు అనుచర వర్గం బల్ల గుద్ది మరీ చెబుతోంది. రీసెంట్ గా అయితే వాసుపల్లి తీవ్ర అసహనం, ఆగ్రహం మిక్స్ చేస్తూ మరీ మీడియా ముందుకు వచ్చారు. తాను తప్ప విశాఖ సౌత్ నుంచి మరెవరూ వైసీపీ నుంచి పోటీ చేయరు అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఇది తన మాట కాదు జగన్ తనకు చెప్పిన మాట అని ఒట్టేశారు. వాసుపల్లికి ఇబ్బందులు కలగకుండా వైసీపీ హై కమాండ్ ఎప్పటికపుడు పోటీదారులకు పదవులు ఇస్తూ లైన్ క్లియర్ చేస్తోంది. అలా కోలా గురువులుని రీసెంట్ గా డీసీసీబీ చైర్మన్ గానూ విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గానూ నియమించారు. దాంతో ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

అయితే మరో కీలక నేత నుంచి వాసుపల్లికి తలనొప్పులు తప్పేట్లు లేవు అంటున్నారు. ఆయనే బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ అయిన సీతం రాజు సుధాకర్. ఆయనకు ఈ ఏడాది మార్చిలో జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే టీడీపీ చేతిలో ఓటమి పాలు అయ్యారు.

దాంతో ఆయన గురి మళ్లీ సౌత్ సీటు మీద పెట్టేశారు అని అంటున్నారు. తాజాగా విశాఖలో జరిగిన విశాఖ కేంద్ర బ్రాహ్మణ ఐక్య వేదిక సమావేశం విశాఖ సౌత్ సీటు సీతం రాజు సుధాకర్ కి ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. విశాఖ దక్షిణం నియోజక వర్గంలో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారని, గత కొన్నేళ్ల నుంచి ఈ నియోజక వర్గం బ్రాహ్మణులకు కేటాయించారని ఐక్య వేదిక నేతలు అంటున్నారు.

ఏ పార్టీ అయినా మా బ్రాహ్మణ నాయకులకు పార్టీ టికెట్టు ఇచ్చినట్టు అయితే వారిని గెలిపించుకుంటామని చెబుతున్నారు. నిజానికి విశాఖ సౌత్ లో చాలా మంది బ్రాహ్మణ నాయకులు గెలిచిన సంగతి విధితమే. కానీ అది గతం. 2019లో బ్రాహ్మణుడు అయిన ద్రోణం రాజు శ్రీనివాస్ కి టికెట్ ఇస్తే ఆయన ఓటమి పాలు అయ్యారు.

ఇక సీతం రాజుకు పార్టీ న్యాయం చేసిందని, కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిందని, అలాగే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిదని పార్టీ వర్గాలు అంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి బలమైన నాయకుడని, రెండు సార్లు గెలిచిన బీసీ నేత అని ఆయనకు కాకుండా వేరే వారికి ఇస్తే మళ్లీ సౌత్ వైసీపీకి దక్కకుండా చేజారుతుందని అంటున్నారు.

అయితే సీతం రాజు సుధాకర్ రూపంలో మాత్రం వాసుపల్లికి తలనొప్పి బాగా ఉందని అంటున్నారు హై కమాండ్ ఈ విషయంలో ఒక డెసిషన్ మీద ఉన్నా ఆయన ప్రయత్నాలు మానడం లేదు. మరి ఆయనకు ఏ విధంగా నచ్చచెబుతారు అన్నది చూడాలి. ఒక విధంగా వాసుపల్లికి టీడీపీతో కంటే సొంత పార్టీతోనే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని ఆయన అనుచరులు అంటున్నారు.