Begin typing your search above and press return to search.

వైసీపీ వర్సెస్ టీడీపీ : మేలో ఎన్నికలు ఎవరికి లాభం...!?

By:  Tupaki Desk   |   16 March 2024 11:30 PM GMT
వైసీపీ వర్సెస్ టీడీపీ : మేలో ఎన్నికలు ఎవరికి లాభం...!?
X

ఏపీలో మే నెల మూడవ వారంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా నాలుగవ విడతలో. నిజానికి ఇలా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎపుడూ ఏపీలో మొదటి రెండు దశలలోనే పోలింగ్ ఉంటూ వచ్చింది. ఇప్పటికి ఇరవై ఏళ్ల క్రితం చూస్తే ఇదే జరిగింది. 2004లో చూస్తే ఏప్రిల్ 26న మొదటి దశలో ఉమ్మడి ఏపీలోని 21 ఎంపీ సీట్లకు అలాగే రెండవద దశలో ఏప్రిల్ 26న ఉమ్మడి ఏపీలో మరో 21 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగిపోయింది. దాంతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తి అయ్యాయి. మే 13న కౌంటింగ్ జరిగింది. మే 16న అప్పటి కాంగ్రెస్ సీఎం గా వైఎస్సార్ ప్రమాణం చేశారు.

ఇక 2009లో తీసుకున్నా ఏప్రిల్ 16, ఏప్రిల్ 23లలో ఉమ్మడి ఏపీ అంతటా పోలింగ్ పూర్తి అయిపోయింది. 2014లో చూసుకుంటే తెలంగాణాలో ఏప్రిల్ 30న పోలింగ్ జరిగింది. ఏపీలో మే 7న పోలింగ్ జరిగింది. ఇక 2019లో చూస్తే మొదటి దశలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. కానీ 2024 లో మాత్రం ఏకంగా మే 13న జరుగుతోంది.

పోలింగ్ డేట్ ఇంత సుదీర్ఘంగా ఉండడం ఎవరికి లాభం అన్న చర్చ ఇపుడు సాగుతోంది. ఇపుడున్న పరిస్థితులలో కచ్చితంగా ఎంతో కొంత విపక్ష కూటమికే మేలు అని విశ్లేషణలు వస్తున్నాయి. ఎలాగంటే వైసీపీ నాలుగు సిద్ధం సభలతో జోరు మీద ఉంది. అలాగే అభ్యర్థులను పూర్తిగా ప్రకటించేసింది. జగన్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు.

అదే విపక్ష కూటమిలో అభ్యర్ధుల ఎంపిక సమస్యగా ఉంది. పొత్తులు చిక్కులు చాలానే ఉన్నాయి. అలకలు అసంతృప్తులను దాటుకుని వారంతా ముందుకు సాగే లోగా ఎన్నికలు అయిపోతాయని అంతా అనుకున్నారు. ఎందుకంటే అంతా ఊహించింది ఏప్రిల్ లో ఎన్నికలు అని. కానీ ఇపుడు మే 13న ఎన్నికలు అని తేలింది.

దాంతో విపక్ష కూటమికి కావాల్సినంత టైం దొరికింది. అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని సర్దిచెప్పుకొని ఐక్యంగా చేసుకుంటూ ముందుకు సాగవచ్చు అని అంటున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి మంత్రులు అంతా నామమాత్రం అయిపోతారు. వారు ఏమీ ఆదేశాలు ఇవ్వలేరు. అధికారాలు ఏమీ ఉండవు.

దాంతో పాటుగా ప్రభుత్వం మీద వివిధ వర్గాలలో ఉన్న వ్యతిరేకత నెమ్మదిగా బయటకు వస్తుంది. దాన్ని రప్పించే ప్రయత్నం విపక్షం చేస్తుంది అని అంటున్నారు. అదే విధంగా చూస్తే మార్చిలోనే ఎండలు అదరగొట్టేస్తున్నాయి. అదే మే నెలలో అయితే కరెంట్ కష్టాలు నీటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా కలసి అధికార పార్టీ మీద వ్యతిరేకతను ఎంతో కొంత రాజేస్తాయని అంటున్నారు.

వీటికి మించి ఇపుడు అధికారం అంతా ఈసీ చేతులలోకి పోయింది ఎలక్షనీరింగ్ విషయంలో కూడా వైసీపీ ఎత్తులకు పై ఎత్తు వేసేందుకే బీజేపీతో కోరి టీడీపీ పొత్తు పెట్టుకుందని అంటున్నారు అదే తీరున వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో టీడీపీ పెద్దలు ఆరితేరారు అని కూడా అంటారు. మొత్తానికి ఇవన్నీ చూస్తే కనుక వైసీపీకి ఇబ్బంది ఏమైనా ఉందా అన్న చర్చ సాగుతోంది.

అయితే ఒక టీవీ డిబేట్ లో పాల్గొన్న వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ మాట్లాడుతూ విపక్షానికి ఎంత టైం ఇచ్చినా వారిది ఓటమి కూటమి తప్ప గెలిచేది కాదని అన్నారు. ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారని అందువల్ల ఏప్రిల్ లో అయినా మే లో అయినా తామే గెలిచి తీరుతామని మంత్రి చెబుతున్నారు.

ఇక చూస్తే 2014లో మే 7న ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది. అదే 2004, 2009, 2019లలో ఏప్రిల్ లో జరిగితే ఓడింది. అందువల్ల మే నెల టీడీపీకి సెంటిమెంట్ కాబట్టి తామే గెలుస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చూడాలి మరి మే 13 ఎవరికి లక్ అందిస్తుందో.