జగన్ అలెర్ట్ కాకపోతే కాంగ్రెస్ కి ఛాన్స్ ఇచ్చినట్లే ?
వైసీపీ తరఫున ఎవరో నాయకులు వచ్చి విమర్శలు చేసినా అవి అంత ధీటుగా ఉండవు.
By: Tupaki Desk | 14 July 2024 4:30 AM GMTవైసీపీ అధినేత జగన్ బలాబలాలు సొంత చెల్లెలు షర్మిలకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియవు. అందుకే ఆమె ఇతర విపక్షాల కంటే ఎక్కువగా సొంత అన్నను ఘాటుగా విమర్శిస్తున్నారు. జగన్ సాధారణంగా విమర్శలకు ప్రతి విమర్శలు చేయడానికి ఇష్టపడరు. వైసీపీ తరఫున ఎవరో నాయకులు వచ్చి విమర్శలు చేసినా అవి అంత ధీటుగా ఉండవు.
ఇంకో వైపు జగన్ మీడియాను ఫేస్ చేయరు. దానికి కారణాలు తెలియవు కానీ ఆయన 2009 నుంచి మొదలెట్టిన రాజకీయ ప్రస్థానంలో చాలా తక్కువగానే మీడియా ముందు కనిపించారు. ఇక సీఎం అయ్యాక ఆయన మీడియాను దూరమే పెట్టారు. ఇపుడు విపక్షంలోకి వచ్చారు. ఈ సమయంలో మీడియా ద్వారానే జనాలతో కనెక్టివిటీ పెంచుకోవాలి. కానీ జగన్ ఆ పని చేస్తున్నట్లు గా కనిపించడం లేదు.
దాంతో మీడియాతో పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల తరచూ ఇంటరాక్ట్ అవుతూ తన బాణాలు అన్నీ జగన్ మీదనే ప్రయోగిస్తున్నారు. మరో విషయం చూస్తే కాంగ్రెస్ చూపు టార్గెట్ అంతా వైసీపీ అన్నదే గుర్తు పెట్టుకోవాల్సింది. వైసీపీ వీక్ అయితేనే కాంగ్రెస్ ఏపీలో బలపడుతుంది. అందుకే షర్మిలను రంగంలోకి దించారు అని అంటున్నారు.
ఆమె బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని కలసి నడుపుతున్న టీడీపీని విమర్శించకుండా వైసీపీని విమర్శించడం వెనక కూడా రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు.వైసీపీ బీజేపీతో అంటకాగుతోంది అని ఆమె హాట్ కామెంట్స్ చేయడం ద్వారా బీజేపీకి దూరంగా ఉండే వర్గాలను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
ఇక బీజేపీ వైసీపీ పరోక్ష పొత్తు అంటూ షర్మిల చేస్తున్న విమర్శలకు వైసీపీ అలెర్ట్ కావాల్సి ఉంది. ఇండియా కూటమి వైపు వైసీపీ రాకపోయినా ఫరవాలేదు కానీ న్యూట్రల్ గా ఉండాలి. నిజానికి లోక్ సభ స్పీకర్ ఎన్నిక వైసీపీకే ఇబ్బంది పెట్టింది అని అంటున్నారు. ఇండియా కూటమి పార్టీలు అలాగే ఉన్నాయి. ఎన్డీయే కూటమి పార్టీలు అలాగే ఉన్నాయి. కొత్తగా ఎన్డీయేకు మద్దతు ఇచ్చిన పార్టీగా వైసీపీయే చర్చకు వచ్చింది.
ఇపుడు అదే ఆయుధంగా కాంగ్రెస్ ఏపీలో వైసీపీని విమర్శిస్తోంది. మరో వైపు చూస్తే బీజేపీ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పడిపోతోంది. తాజా ఉప ఎన్నికల ఫలితాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీకి దూరంగా వైసీపీ ఉండడమే మేలు అని అంటున్నారు. వైసీపీ అలా ఉన్నపుడే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను సమర్ధంగా పోషించగలదని అంటున్నారు
లేకపోతే కేంద్రంతో దోస్తీ ఏపీలో కుస్తీ అంటే గతంలో మాటేమో కానీ ఇపుడు జనాలు అయితే విశ్వసించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సితం మైనారిటీలు చాలా శాతం కాంగ్రెస్ వైపు మళ్లడానికి కారణం జాతీయ స్థాయిలో వైసీపీ కన్ఫ్యూజన్ గా ఉండడం, బీజేపీకి మద్దతు ఇవ్వడమే అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో దేశంలో ఇండియా కూటమి గ్రాఫ్ అంతకంతకు పెరుగుతోంది. ఆ ప్రభావం ఏపీ మీద కచ్చితంగా పడుతుంది. అలా జరగకుండా ఉండాలీ అంటే పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అనుసరించిన విధానమే ఏపీలో వైసీపీ అనుసరించాలని అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మమత నిలదొక్కుకుని మూడు సార్లు గెలిచారు అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని మొత్తం తన వైపు తిప్పుకుని సుస్థిరం చేసుకున్నారని అంటున్నారు.
ఏపీలో కూడా వైసీపీ తన మూల నిధి లాంటి ఓటు బ్యాంక్ ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవాలంటే బీజేపీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిందని అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ మీద ఏపీ నుంచి గట్టిగా పోరాడే పార్టీగా మారినా వైసీపీకి కొత్త ఇమేజ్ వస్తుందని అంటున్నారు. ఏపీలో బీజేపీ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రత్యేక హోదా పోలవరం విభజన హామీలు విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి వాటి మీద వైసీపీ పూర్తి స్థాయిలో పోరాటాలు చేసేందుకు విశాలమైన వేదిక అలా నిర్మాణం అవుతుందని అంటున్నారు.
లేకపోతే ఇదే విధంగా బీజేపీకి మద్దతు ఇస్తూ పోతే మాత్రం ఏపీలో షర్మిల రూపంలో కాచుకుని కూర్చున్న కాంగ్రెస్ కి వైసీపీ ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ పూర్తిగా మళ్ళిపోయేందుకు చేజేతులా వైసీపీ ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న వేళ ఆ పార్టీతో అంటకాగినా రేపటి రోజున ఉపయోగం లేదని తెలుస్తున్నపుడు వైసీపీ దూరం గా ఉండడమే బెటర్ అన్న సూచనలు వస్తున్నాయని అంటున్నారు.