వైసీపీ యాత్ర స్పెషల్.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందంటే..!
దీనిలోనూ నాయకులు పార్టిసిపేట్ చేస్తూ.. పార్టీ ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు.
By: Tupaki Desk | 3 Dec 2023 12:30 PM GMTఏపీ అధికార పార్టీ వైసీపీ యాత్రా స్పెషల్ జపాన్ని పఠిస్తోంది. ఒకవైపు పార్టీ అధిష్టానం.. జనంలోకి నాయకు లు వెళ్లేలా యాత్రలకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే గడపగడపకు మన ప్రభుత్వం అమలు చేసింది. తర్వాత.. బీసీ బస్సు యాత్ర చేపట్టింది. ఇక, ఆ తర్వాత.. ఇప్పుడు సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తోంది. దీనిలోనూ నాయకులు పార్టిసిపేట్ చేస్తూ.. పార్టీ ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు.
ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం. అయితే.. దీనికి భిన్నంగా కొందరు నాయకులు సొంత యాత్రలు చేస్తున్నారు. వీరిలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వంటివారు.. సొంత యాత్రలకు తెరదీశారు. వీరంతా.. తమ తమ నియోజవకర్గాల్లోని ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు తీర్థయాత్రలకు పచ్చ జెండా ఊపారు. కాపు రామచంద్రారెడ్డి తిరుమల యాత్రను ఎంచుకున్నారు.
తన నియోజకవర్గంలోని తన అనుకూల వర్గాలను ఆయన ప్రత్యేక బస్సుల ద్వారా తిరుమలకు తీసుకువెళ్లి శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. బస్సులు పెట్టడంతోపాటు.. తిరుమలలో బస కూడా ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే.. ఏకంగా కాశీయాత్రకు తీసుకువెళ్తానని కాపు ఇక్కడివారికి హామీ ఇస్తున్నారు మరోవైపు.. వెంకటేగౌడ్ ఏకంగా.. తమిళనాడు టూర్లకు ప్లాన్ చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో ఆయన ఇప్పటికే ఐదు బస్సుల ద్వారా.. ఇక్కడి అనుకూల వర్గాలను ఆయన అరుణాచలం, కంచి వంటి ప్రముఖ క్షేత్రాలకు పంపించారు.
అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. ఇప్పటికే రెండు దఫాలుగా నాలుగు బస్సులో 500 మంది యాత్రికులను శ్రీశైలం సహా.. పంచారామ క్షేత్రాలకు తీసుకువెళ్లారు. కార్తీక మాస వన భోజనాలకు కూడా ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తూ.. ఓటర్లను తనవైపు మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాను గెలిస్తే.. మళ్లీ కాశీ యాత్ర సహా.. గయ వంటి ప్రసిద్ధ యాత్రలకు తీసుకువెళ్తానని చెబుతున్నారు. ఇక, రాబోయే రోజుల్లో ఇంకెన్ని యాత్రలు తెరమీదికి వస్తాయో చూడాలి.