Begin typing your search above and press return to search.

టీడీపీకి గుర్తుండిపోయే ఏడాది - 2024

ఏపీ రాజకీయాల్లో టీడీపీ శకం ముగిసిపోయిందనే అంచనాలను తలకిందులు చేస్తూ నవ చరిత్రకు నాంది పలికిన ఏడాది 2024.

By:  Tupaki Desk   |   21 Dec 2024 9:30 PM GMT
టీడీపీకి గుర్తుండిపోయే ఏడాది - 2024
X

42 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో 2024 ఏడాది ఓ మైలురాయి. నాలుగుదశాబ్దాల పార్టీ ప్రస్థానంలో కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకుని అందరిని ఆశ్చర్యపరిచిన ఏడాది ఇది. ఏపీ రాజకీయాల్లో టీడీపీ శకం ముగిసిపోయిందనే అంచనాలను తలకిందులు చేస్తూ నవ చరిత్రకు నాంది పలికిన ఏడాది 2024.

175/175 అంటూ గర్జించిన వైసీపీని తలెత్తుకోకుండా, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని విధంగా 2024 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. 1982లో అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత 1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఈ ఎన్నికల రికార్డును చెరిపేస్తూ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సువర్ణాధ్యయాన్ని లిఖించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

57 శాతం ఓటు షేరుతో 93 శాతం స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ.. 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని నియోజకవర్గాల్లో సైతం పసుపు జెండా ఎగరేసింది. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమై ఘోర పరాజయం ఎదుర్కొన్న టీడీపీ, ఆ పార్టీ నేతలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే ఆ అవమానాలన్నీ పటా పంచలు చేస్తూ సగర్వంగా గెలిచి నిలిచింది టీడీపీ. సొంతంగా 135 స్థానాలు సాధించడమే కాకుండా మిత్రపక్షాలైన జనసేన 21 చోట్ల, బీజేపీ 8 చోట్ల గెలవడంతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది టీడీపీ. ఈ విజయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు. వైపీపీ పాలనలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్న నేతలకు వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా స్వయంగా ఆయన కూడా జైలుకు వెళ్లారు. అసెంబ్లీలో తన భార్యను అవమానిస్తే, మళ్లీ గెలిచాకే సభలో అడుగు పెడతానని చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. అందుకే 2024 టీడీపీ ఎప్పటికీ మరచిపోలేని ఏడాదిగా చరిత్రలో మిగిలిపోతుంది.

ఈ ఏడాది తొలి ఆరు నెలలు అప్పటి అధికార పార్టీ వైసీపీతో తీవ్రస్థాయిలో పోరాడిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నికల్లో గెలిచాక ఈ ఆర్నెళ్లు రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన కష్టానికి ఫలితంగా ఈ ఏడాది రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి. విశాఖలో టీసీఎస్ సర్వీస్ సెంటర్ తోపాటు గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అదేవిధంగా గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి తరలిపోయిన పరిశ్రమలు మళ్లీ వచ్చే విధంగా చర్యలు తీసుకుని కొంతమేర సక్సెస్ అయ్యారు. లులూ, ఓబెరాయ్ వంటి సంస్థలు రాష్ట్రంలో తిరిగి తమ వ్యాపారాలు ప్రారంభించేందుకు అంగీకరించాయి. అదేవిధంగా హిందూస్థాన్ పెట్రోలియం, ఆర్సెలార్ మిట్టల్ వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇలా టీడీపీకి ఆ పార్టీ అధినేతకు 2024 ఎంతో కలిసోచ్చింది.