కేసీఆర్‌తో అమిత్ షా కుమ్మక్కు... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీ రాష్ట్ర పార్టీ బహిష్కృత వేటు వేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
By: Tupaki Desk | 6 Sep 2023 1:30 AM GMTతెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి, దేశంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అడపాదడపా ఈ రెండు పార్టీల రాజకీయ ప్రత్యర్థి పార్టీలు కామెంట్లు చేయడం తెలిసిందే. అయితే, తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర పార్టీ బహిష్కృత వేటు వేసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. 1996 నుంచి బీజేపీలో ఉన్న తాను.. ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని.. అలాంటి నన్ను బీఆర్ఎస్ తో కుమ్మక్కై తనను పార్టీ నుంచి బహిష్కించారని ఆరోపించారు. వివరణ అడగకుండా సస్పెండ్ చేస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రహస్య ఒప్పందానికి నిదర్శనమే తన బహిష్కరణ అని మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. లిక్కర్ స్కాంను బీజేపీ పెద్దలే బయటపెట్టి ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారో చెప్పాలని యెన్నం డిమాండ్ చేశారు. రానున్న రోజులలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని తెలిపిన యొన్నం అందుకే తనను బయటికి పంపించారని అన్నారు. బీఆర్ఎస్‌తో రాజకీయంగా తేల్చుకునేందుకు బీజేపీలో చేరిన తనలాంటి నేతలు ఆ విధంగా ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని, తమ గొంతు నొక్కేందుకే సస్పెన్షన్ వేటు వేశారని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. పార్టీలో చేరవలసిందిగా కాంగ్రెస్ నేతలను తనతో చర్చలు జరిపారని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని ప్రకటించారు.
ఈ సందర్భంగా బీజేపీ ముఖ్యనేత, కేంద్ర మంత్రి అమిత్ షా పై యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలున్నా చివరి మూడు రోజుల్లో సీన్ మారిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా పరిధిలో ఉండే కేంద్ర బలగాలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లాయని, అమిత్ షా పై అనుమానం కలిగించే కామెంట్లు చేశారు. మునుగోడులో ఓటమి తర్వాత 6 నెలల వరకు రాజగోపాల్రెడ్డికి ఎందుకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదని యెన్నం ప్రశ్నించారు.