యోగి సంచలనం.. కశ్మీర్ ఎన్నికల తర్వాత పీవోకే మనదేనట
పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లోకి తిరిగి చేర్చాలన్నది ప్రతి ఒక్కడి భారతీయుడి కల.
By: Tupaki Desk | 27 Sep 2024 4:49 AM GMTతాజాగా జరుగుతున్న మూడు రాష్ట్రాల ఎన్నికల వేళ.. ఎప్పటిలానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జమ్ముకశ్మీర్ లో బీజేపీ పవర్లోకి వస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కూడా కశ్మీర్ రాష్ట్రంలో భాగమవుతుందంటూ వ్యాఖ్యలు చేవారు. పాకిస్థాన్ నుంచి విడిపోతామంటూ ఆ ప్రాంతం గొంతెత్తి చెబుతుందని పేర్కొన్నారు.
కేంద్రంలో బలమైన సర్కారు కారణంగా కశ్మీర్ లో ఎన్నికలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పిన ఆయన.. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్ములోని ఆర్ ఎస్ పుర ప్రాంతంలో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించారు. పాక్ పరిస్థితి అల్లకల్లోలమన్న ఆయన.. ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి తంటాలు పడుతున్నట్లు పేర్కొన్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లోకి తిరిగి చేర్చాలన్నది ప్రతి ఒక్కడి భారతీయుడి కల. అందుకు కేంద్రం చేయాల్సిన చర్యలు చేపట్టాలి. అంతేకాదు.. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే.. పోగొట్టుకున్న పీవోకే తిరిగి వస్తుందన్న మాటలో అర్థం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో సెంటిమెంట్ ను రాజేయటం.. భావోద్వేగ రాజకీయాల్లో భాగంగా ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. పాకిస్థాన్ ను మానవత్వానికి శత్రువుగా.. మానవాళి పాలిట క్యాన్సర్ గా అభివర్ణించిన యూపీ సీఎం యోగి.. మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు.