యోగీకి పొగ పెడుతున్నారా ?
ఈ నేపథ్యంలో యూపీ పరాజయాలకు యోగీ ఆదిత్యనాథ్ ను బాధ్యుడిగా చేయాలని చూస్తున్నట్లు బీజేపీ శ్రేణులలో చర్చ నడుస్తున్నది.
By: Tupaki Desk | 9 Jun 2024 4:30 PM GMTబీజేపీ కంచుకోట అనుకున్న ఉత్తరప్రదేశ్ లో ఆ పార్టీ ప్రతిష్ట బీటలు వారింది. 2019లో 62 స్థానాలు సాధించిన బీజేపీ ఇప్పుడు కేవలం 33 స్థానాలకే పరిమితమైంది. 2019లో 49.6 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 41.4 శాతానికి పడిపోయింది. ఈసారి బీజేపీ 49 మంది సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వగా 27 మంది ఓడిపోయారు. దీంతో బీజేపీ కేవలం 240 లోక్ సభ స్థానాలకు మాత్రమే పరిమితమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు భాగస్వామ్యపక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది.
2019లో 49.6 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 41.4 శాతానికి పడిపోయింది. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ(అమేథీ), అజయ్ మిశ్రా(ఖేరి), మహేంద్రనాథ్ పాండే(చందౌలి), ఎనిమిదిసార్లు ఎంపీగా పనిచేసిన మేనకా గాంధీ(సుల్తాన్‌పూర్), మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ కుమారుడు రాజ్‌వీర్ సింగ్(ఎటా) తదితర ప్రముఖ బీజేపీ నేతలు ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో యూపీ పరాజయాలకు యోగీ ఆదిత్యనాథ్ ను బాధ్యుడిగా చేయాలని చూస్తున్నట్లు బీజేపీ శ్రేణులలో చర్చ నడుస్తున్నది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా ప్రకటన యోగీకి చెక్ పెట్టేందుకేనని అంటున్నారు. యోగీ మీద ఒత్తిడి పెంచేందుకే ఆయన ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో కేంద్ర నాయకత్వం తప్పిదమే ఈ ఫలితాలకు కారణమని యోగీ వర్గం వాదిస్తుండగా, యూపీలో వరుసగా జరిగిన ప్రశ్నా పత్రాల లీకేజీలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల వాయిదాలు, పెరిగిపోయిన నిరుద్యోగం, వంటి అంశాలు ఎన్నికల్లో బీజేపీకి నష్టం చేశాయని అంటున్నారు. అందుకే యోగీని వీటికి బాధ్యుడిని చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతున్నారు. కొంతకాలం ఆగితే ఏం జరుగుతుందో తెలుస్తుంది.