ఉదయనిధి... అల్ప పరాన్న జీవి: యూపీ సీఎం యోగి ఫైర్
ఈ పరంపరలో తాజాగా యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా స్పందించా రు. తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు గుప్పించారు.
By: Tupaki Desk | 8 Sep 2023 9:32 AM GMTతమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అలజడి రేపిన విషయం తెలిసిందే. డెంగీ, మలేరియా మాదిరిగా సనాతన ధర్మాన్ని కూడా శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి.. రెండు వారాలైనా కూడా.. ఇంకా ఆ వ్యాఖ్యల తాలూకు వేడి ఏమాత్రం తగ్గలేదు.
ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉదయ నిధిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ పరంపరలో తాజాగా యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా స్పందించా రు. తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు గుప్పించారు.
ఉదయనిధిని 'అల్ప పరాన్న జీవి'గా అభివర్ణించా రు. ఇలాంటి వారు ఏమీ చేయలేరని.. వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని పాడు చేసేందుకు, అంతం చేసేందుకు యుగయుగాలుగా అనేక ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు.
"రామాయణ కాలంలో రావణుడి అహంకారంతో సనాతన ధర్మం అంతం కాలేదు. మహాభారత కాలంలో కంసుడి గర్జనకు సనాతన ధర్మం చలించలేదు..ఆధునిక యుగంలో బాబర్, ఔరంగజేబుల దురాగతాలకు సనాతన ధర్మం నశించలేదు. అలాంటి సనాతన ధర్మం ఇలాంటి అల్ప పరాన్న జీవుల వల్ల(ఉదయనిధి స్టాలిన్) ఎలా అంతమవుతుంది" అని ఎక్స్ (ట్విటర్) ఖాతాలో యోగి పోస్టు చేశారు. ఇక, దీనిపై ఉదయనిధి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.