Begin typing your search above and press return to search.

యూపీలో మోదీ యోగీ మ్యాజిక్ ఏదీ ?

దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. అక్కడ ఎనభై ఎంపీ సీట్లు ఉన్నాయి. దేశంలో ఉన్న మొత్తం ఎంపీ సీట్లలో ఆరవ వంతు అన్న మాట

By:  Tupaki Desk   |   4 Jun 2024 1:30 PM GMT
యూపీలో మోదీ యోగీ మ్యాజిక్ ఏదీ ?
X

దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. అక్కడ ఎనభై ఎంపీ సీట్లు ఉన్నాయి. దేశంలో ఉన్న మొత్తం ఎంపీ సీట్లలో ఆరవ వంతు అన్న మాట. అంటే 15 శాతానికి పైగా ఎంపీల షేర్ మొత్తం పార్లమెంట్ లో యూపీదే.

అలాంటి యూపీ 2014, 2019లలో బీజేపీని నెత్తికెత్తుకుంది. రెండు సార్లు బ్రహ్మాండమైన మెజారిటీని బీజేపీకి ఇచ్చింది. 2014లో 70కి పైగా ఎంపీలను బీజేపీ గెలిస్తే 2019 నాటికి 62 దాకా గెలుచుకున్నారు. 2024 కి వచ్చేసరికి ఆ సంఖ్య కాస్తా కేవలం 345కి పడిపోయింది.

అంటే సగానికి సగం అన్న మాట. మరి అక్కడ బీజేపీ విజయాన్ని ఎవరు అడ్డుకున్నారు అంటే సమాజ్ వాదీ పార్టీ అని చెప్పాలి. ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో తక్కువ సీట్లే దక్కాయి. కానీ ఈసారి ఏకంగా 34 సీట్ల దాకా తెచ్చుకునేలా ఉంది. ఒక దశలో బీజేపీ కంటే ముందుకు కూడా దూసుకుని వచ్చేలా ఫలితాల సరళి ఉంది.

దీనిని బట్టి చూస్తే యూపీలో బీజేపీ ప్రాభవం మెల్లగా సడలిపోతోంది అని అంటున్నారు. బీజేపీకి గుండె కాయ లాంటి రాష్ట్రం ఇలా హ్యాండ్ ఇవ్వడంతోనే ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది అని కూడా అంటున్నారు. ఎడం చేత్తో అధికారాన్ని సులువుగా అందుకే దశ నుంచి ఈ రోజున బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవడానికి నానా అవస్థలూ పడుతోంది.

అంతే కాదు కాంగ్రెస్ కూడా యూపీలో బాగా పుంజుకుంది. ఇలా ఇండియా కూటమి అక్కడ పై చేయి సాధించడంతో మోడీ యోగీల మ్యాజిక్ ఏమి అయింది అన్న చర్చ ముందుకు వస్తోంది. కడపటి వార్తలు అందేసరికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేధీలో ఓటమిని మూటగట్టుకున్నారు. అక్కడ కాంగ్రెస్ కి వీర విధేయుడు అయిన కిశోర్ లాల్ శర్మ చేతిలో ఆమె పరాజయం పాలు చెందారు.

ఆమె 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి దేశమంతా తన వైపుచూసుకునేలా చేశారు. ఇపుడు ఆమె పరాజయం చెందడం ఆశ్చర్యంగానే ఉంది. అలాగే మరో బీజేపీ దిగ్గజ నేత మేనకాగాంధీ కూడా వెనకంజలో ఉన్నారు. ఇవన్నీ చూస్తూంటే యూపీలో కమలానికి ఎక్కడో మసకబారడం మొదలైంది అనీ అంటున్నారు.

యోగీ ఏమీ తక్కువ వారు కాదు, 2017, 2022లలో బీజేపీని యూపీలో వరసగా రెండు సార్లు గెలిపించడంతో సిద్ధహస్తుడుగా ఉన్నారు. ఆయన పాలనలో మెరుపులు అంటూ కూడా చెప్పుకున్నారు. ఆయన కూడా ప్రజాకర్షణలో ధీటైన వారుగా ఉన్నారు.

ఇక రామ మందిరం అన్నది ఒక రకంగా బీజేపీకి కలసి వస్తుంది అనుకుంటే ఆ నియోజకవర్గంలోనే బీజేపీ ఓటమి పాలు అయింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్ సభ సీటులో బీజేపీ ఎస్పీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలు అయింది. ఓవరాల్ గా చూసుకుంటే యూపీలో మోడీ కానీ యోగీ కానీ మ్యాజిక్కులు ఏవీ పనిచేయలేదని అర్ధం అవుతోంది అంటున్నారు. ఇది ఒక విధంగా బీజేపీ పొలిటికల్ కెరీర్ లో అతి పెద్ద దెబ్బ గానే అంతా చూస్తున్నారు.