భారతీయ బిలియనీర్ 500 కోట్ల స్పాట్ డీల్
ఇటీవల రిలయన్స్ అంబానీ తన కుమారుడి పెళ్లి కోసం 5000 కోట్లు ఖర్చు చేయడం సంచలనమైంది.
By: Tupaki Desk | 10 Aug 2024 5:47 AM GMTఇటీవల రిలయన్స్ అంబానీ తన కుమారుడి పెళ్లి కోసం 5000 కోట్లు ఖర్చు చేయడం సంచలనమైంది. ఈ ఖర్చు గురించి ఇప్పటికీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. లక్షల కోట్ల ఆస్తులున్న అంబానీకి ఈ ఖర్చు నామమాత్రమైనదని అంతా చర్చించారు. ఇప్పుడు ప్రముఖ బిలియనీర్ యోహాన్ పూనావల్ల-ఆయన భార్య మిచెల్ ముంబైలో రూ. 500 కోట్ల విలువైన భవనాన్ని కొనుగోలు చేయడం గురించి ప్రజలు ఆసక్తికరంగా ముచ్చటించుకుంటున్నారు.
ఎంటర్ టైన్ మెంట్ టునైట్ కథనం ప్రకారం... బిలియనీర్ పారిశ్రామికవేత్త యోహన్ పూనావల్లా .. అతడి భార్య మిచెల్ దక్షిణ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ. 500 కోట్ల విలువ చేసే 30,000 చదరపు అడుగుల స్వతంత్ర ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ విశాలమైన భవనం, ఇటీవలి కాలంలో అత్యంత ఖరీదైన నివాస ఒప్పందాలలో ఒకటి. పూనవల్లాకు ఇప్పటికే భారీ గృహం ఉంది. ఇప్పుడు కొనుగోలు చేసిన భవంతి వారి ద్వితీయ గృహంగా రూపాంతరం చెందుతుంది. దీనిని `పూనావాలా మాన్షన్` అని పిలుస్తారు.
పూనావాలా ఇంజినీరింగ్ గ్రూప్ ఛైర్మన్ , పూనవల్ల స్టడ్ ఫామ్స్, పూనవల్ల రేసింగ్ అండ్ బ్రీడింగ్ డైరెక్టర్ అయిన యోహాన్ పూనవల్ల ప్రముఖ వ్యాపార కుటుంబం నుండి వచ్చారు. అతడి తండ్రి, జవరాయ్ పూనావల్లా, ప్రముఖ టీకా తయారీదారు అయిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు సహవ్యవస్థాపకుడు. పూనావాలాలు ఆసియాలోని అతిపెద్ద స్టడ్ ఫామ్‌లలో ఒకదానిని కలిగి ఉన్నందుకు కూడా ప్రసిద్ధి చెందారు.
పూనావల్ల ఇంజనీరింగ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్ మిచెల్ పూనావాలా ఒక వ్యాపారవేత్త. ఆమె డిజైనింగ్ సంస్థ MYP డిజైన్ స్టూడియోని నిర్వహిస్తున్నారు. కొత్తగా సంపాదించిన ఆస్తిని `పూనావల్లా మాన్షన్`గా మార్చే బాధ్యతను ఆమె తీసుకున్నారు. భవనం విశాలమైన లేఅవుట్, విశాలమైన డాబాలు, బహుళ అంతస్తులలో విస్తరించి ఉంది. మిచెల్ పూనావల్లా ప్రత్యేకమైన ఆయిల్ పెయింటింగ్‌లు మరియు ఇతర విలువైన ముక్కలను ప్రదర్శిస్తూ నివాసంలో కొంత భాగాన్ని ప్రైవేట్ ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్నారు.. యోహాన్ పూనావల్ల ఆటోమొబైల్ (కార్లు ఇతర వాహనాలు) సేకరణ క్యూరేటెడ్ ఎంపిక కూడా భవనంలో ప్రదర్శిస్తారు.
దక్షిణ ముంబైలో ఇటీవల సెలబ్రిటీల ఆస్తుల కొనుగోళ్లు బాగా పెరిగాయి. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ , యువరాజ్ సింగ్ ఈ ప్రాంతంలో భారీ ఆస్తులను కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ వర్లీ ఓంకార్ 1973 ప్రాజెక్ట్‌లో రూ. 34 కోట్లకు విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు. రోహిత్ శర్మ వర్లీలోని అహుజా టవర్స్‌లో రూ. 30 కోట్ల ఆస్తిని కొనుక్కున్నాడు. యువరాజ్ సింగ్ అదే పరిసరాల్లో రూ.64 కోట్ల ఆస్తిని కొనుగోలు చేశాడు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు దినేష్ విజన్ కూడా దక్షిణ ముంబైలోని పాపులర్ ఆస్తులకు యజమానుల జాబితాలో చేరారు. 9,000 చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని దినేష్ కొనుగోలు చేశారు. సుహానా ఖాన్ అలీబాగ్‌లోని 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని రూ. 12.91 కోట్లకు కొనుగోలు చేయగా..అలియా భట్ ప్రొడక్షన్ హౌస్ బాంద్రాలోని 2,497 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 37.80 కోట్లకు కొనుగోలు చేసింది.