హోటల్ రూంలో పెళ్లి చేసుకొని సూసైడ్ చేసుకున్న ప్రేమజంట
తాజాగా మరో జంట హోటల్ రూంలో పెళ్లి చేసుకొని అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణలో చోటు చేసుకున్న ఈ విషాదంలోకి వెళితే..
By: Tupaki Desk | 11 Jan 2025 7:30 AM GMTప్రేమించేందుకు ధైర్యం ఉన్నప్పుడు.. ఆ ప్రేమను నిలుపుకోవటం కోసం పోరాడాలి కదా? ఈ క్రమంలో ప్రేమను అంగీకరించని పెద్దల్ని ఒప్పించటం.. వారి మనసులు మారేలా వ్యవహరించటం అవసరం. అందుకు కొంత సమయం పట్టొచ్చు. అప్పటివరకు ఓపికగా.. ధైర్యంగా నిలబడాల్సి ఉంటుంది. ప్రేమించే సాహసం ఉన్న ఈ తరం.. అదే ప్రేమను గెలిపించుకోవటం కోసం ఓపికతో ప్రయత్నాలు చేసే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు.
తెలిసి తెలియని ఆవేశాలతో.. భావోద్వేగాలతో ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి గుండె కోతను మిగులుస్తున్నారు. వారి జీవితానికి భారీ శిక్షను విధిస్తున్నారు. ప్రేమను గెలిపించుకోవటం కోసం పోరాడాలే కానీ ప్రాణాలు తీసుకోవటం పరిష్కారం కాదన్న విషయాన్ని ఇప్పటి యువత మర్చిపోతున్నారు. దీన్నో అలవాటుగా చేసుకోవటం ఆందోళన కలిగించే అంశం. ఈ మధ్యనే ఒక ప్రేమ జంట తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని.. కారులో ఉండి పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకొని ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా మరో జంట హోటల్ రూంలో పెళ్లి చేసుకొని అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణలో చోటు చేసుకున్న ఈ విషాదంలోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల ఉదయ్ కుమార్ మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. మూడు నెలల క్రితమే రోడ్డు ప్రమాదంలో అతడి తండ్రి చనిపోయారు. దీంతో తండ్రి వ్యాపారాన్ని అతను నిర్వహిస్తున్నాడు. తమ ఊరికే చెందిన 20 ఏళ్ల రోహితతో ప్రేమలో ఉన్నాడు. ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇద్దరిది ఒకే ఊరు కావటం.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వారి ప్రేమకు పెద్దలు నో చెప్పారు. ఇటీవల గ్రామస్థుల సమక్షంలో సర్ది చెప్పి.. విడిగా ఉండాలని డిసైడ్ చేశారు.
దీంతో మనస్తాపానికి గురైన ఈ ప్రేమ జంట.. ఊరికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుసారెడ్డిపల్లి శివారులోని రిసార్టుకు వెళ్లారు. అక్కడో రూం తీసుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న పసుపు.. కుంకుమతోస్థానిక ఆచారం ప్రకారం బొట్టు పెట్టుకొని.. పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇద్దరు గదిలో ఒకే తాడుతో ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం వారు రూంను ఖాళీ చేయాల్సి ఉన్నప్పటికి.. ఖాళీ చేయకపోవటంతో రూం తలుపు కొట్టినా ఎలాంటి స్పందన లేదు.
దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిబ్బందితో వచ్చిన ఎస్ఐ రాజేష్ నాయక్.. కిటికీలు బద్దలు కొట్టి చూడగా.. ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయిన విషయానని గుర్తించారు. గదిని బుక్ చేసిన సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా.. గురువారం ఉదయం రోహిత తండ్రి తమ కుమార్తె కనిపించట్లేదని.. ఉదయ్ కుమార్ తల్లి సైతం పోలీసులకు తమ కొడుకు కనిపించటం లేదన్న ఫిర్యాదు ఇచ్చినట్లుగా గుర్తించారు. పిల్లల ప్రేమను అంగీకరించని వేళ.. పెను విషాదానికి దారి తీసిందని చెప్పాలి.