విషాదం... తొలి పోస్టింగ్ కు వెళ్తూ యంగ్ ఐపీఎస్ దుర్మరణం!
ఈ సమయంలో కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొలి పోస్టింగ్ కు వెళ్తూ ఓ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మరణించడం తీవ్ర విషాదంగా మారింది.
By: Tupaki Desk | 2 Dec 2024 9:26 AM GMTరోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను చిదిమేస్తోన్న సంగతి తెలిసిందే! రోడ్డు ప్రమాదాల వల్ల బిడ్డలను కోల్పోయిన తల్లితండ్రులు, తల్లితండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు ఎంతోమంది. ఈ సమయంలో కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొలి పోస్టింగ్ కు వెళ్తూ ఓ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మరణించడం తీవ్ర విషాదంగా మారింది.
అవును... మధ్యప్రదేశ్ కు చెందిన హర్ష్ బర్దన్ (26) కర్ణాటక కేడర్ కు చెందిన 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఇటీవల ఆయన ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన తొలి పోస్టింగ్ ను చేపట్టేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవసాత్తు మృతి చెందారు.
హర్ష్ బర్ధన్ తన తొలి పోస్టింగ్ స్వీకరించేందుకు వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న పోలీస్ వాహనం టైరు పగిలిపోవడంతో.. కారు నియంత్రణ కోల్పోయి.. హసన్ – మైసూర్ హైవేలోని రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టి, అనంతరం చెట్టును ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఈ యంగ్ ఐపీఎస్ తలకు బలమైన గాయం తగిలింది.
దీంతో... ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆదివారం సాయంత్రం 4:20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. హోలెనరసిపూర్ లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టేందుకు వెళ్తుండగా ఈ దారుణం జరిగింది.
ఈ సందర్భంగా బర్ధన్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం లభించిన సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా బర్ధన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ్ కూడా ఈ ఘటనపై తీవ్ర సంతాపం తెలిపారు. ఇది ఎంతో విషాదకరమైన విషయమని.. అంకితభావంతో కూడైన యువ అధికారిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.