ఎమ్మెల్సీ పదవులు కూడా వారికే...టీడీపీ మార్క్ డెసిషన్ !
పార్టీలో మొదటి నుంచి ఉన్న వారే ఎపుడూ చాన్సులు అందుకుంటున్నారు. దాంతో ద్వితీయ శ్రేణి నేతలు వెనుకబడిపోతున్నారు.
By: Tupaki Desk | 4 March 2025 2:00 AM ISTతెలుగుదేశం పార్టీ తనదైన రాజకీయ విధానంలో ముందుకు పోతోంది. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీ వయసు ఈ రోజుకు నాలుగున్నర దశాబ్దాలు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారే ఎపుడూ చాన్సులు అందుకుంటున్నారు. దాంతో ద్వితీయ శ్రేణి నేతలు వెనుకబడిపోతున్నారు.
ఇక సీనియార్లు అనే మర్రి చెట్టు కింద కొత్త వారు ఎదిగే సూచనలు లేకపోవడం కూడా టీడీపీకి ఇబ్బందిగా మారింది. అందుకే టీడీపీ తన ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చుకుంది అని అంటున్నారు. ఆ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే దగ్గర నుంచి యువతకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. వారికే పట్టం కట్టింది.
ఆ మీదట మంత్రి పదవులు వారికే ఎక్కువగా ఇస్తూ తమ కొత్త రూట్ ఏంటో చెప్పకనే చెప్పింది. ఇక రాజ్యసభ సీట్ల విషయంలో సానా సతీష్ లాంటి వారికి ప్రాముఖ్యత ఇవ్వడాన్ని అంతా చూశారు. ఇపుడు ఏపీలో ఖాళీ అవుతున్న అయిదు ఎమ్మెల్సీలలో మిత్రులకు పోనూ టీడీపీ తీసుకునే సీట్లలో కూడా కొత్తవారికి యువతకే ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు.
యువతకు పట్టం కడితే పార్టీకి మరిన్ని కాలాల పాటు పనికి వస్తారని అదే విధంగా వారికి ఇచ్చిన ఈ పదవిని బంగారంగా భావించి కష్టపడతారని ఆలోచిస్తున్నారు. అదే సీనియర్లకు పదవులు ఇస్తే ఎమ్మెల్సీ కాగానే మంత్రి పదవి కోసం చూస్తారని కూడా భావిస్తున్నారు.
పైగా పార్టీకి 2019 నుంచి 2024 మధ్య గడ్డు కాలం నడచిందని ఆ సమయంలో పార్టీ కోసం బయటకు వచ్చి కష్టపడింది యువత అన్నది కూడా పార్టీ అధినాయకత్వం గుర్తించింది అంటున్నారు. అటు చంద్రబాబు సభలు సమావేశాలు అయినా ఇటు లోకేష్ యువగళం పాదయాత్ర అయినా ఎక్కువగా యువ నాయకులే పాలుపంచుకున్నారని అంటున్నారు వారే జనసమీకరణ చేసి అన్ని సభలను జయప్రదం చేశారని గుర్తు చేస్తున్నారు.
మరో వైపు చూస్తే టీడీపీలో ఇపుడు నడుస్తోంది లోకేష్ జమానా అని అంటున్నారు. ఆయనే ఈ ఎంపికలో కీలకంగా ఉంటారని చెబుతున్నారు. దాంతో లోకేష్ యువతకే పెద్ద పీట వేస్తారు అని చెబుతున్నారు. దాంతో సీనియర్లు చాలా మంది మరోసారి ఎమ్మెల్సీ కావాలని ఆశలు పెట్టుకున్నా పార్టీ ఆలోచనలు చూసి వెనక్కి తగ్గారని అంటున్నారు.
ఇక పార్టీలో వచ్చే ఏ పదవి అయినా కొత్త వారికి యువతకే అన్నది టీడీపీ అనుసరిస్తున్న విధానంగా ఉంది. చంద్రబాబు సమకాలీనులు ఆయతో పాటు కలసి అడుగు వేసిన నాయకులకు చాన్స్ ఉండదని చెబుతున్నారు. పార్టీకి శ్రేయోభిలాషులుగానే ఇక మీదట సీనియర్లు మిగిలినే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ నిర్ణయం పట్ల సీనియర్ల మనోభావాలు ఎలా ఉంటాయన్నది పెద్దగా చర్చకు రాకున్నా టీడీపీ అంటే ఇక యువతరం అన్నది మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ద్వారా అధినాయకత్వం స్పష్టం చేయనుంది అని అంటున్నారు.