హైదరాబాద్ లో దారుణం... ప్రేమోన్మాదులు ఇప్పుడు పేరెంట్స్ పై పడ్డారా?
అయితే తాజాగా తాను ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందనే కోపంతో ఆమె తల్లితండ్రులపై కాల్పులు జరిపాడో వ్యక్తి! ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
By: Tupaki Desk | 11 Nov 2024 5:32 AM GMTతన ప్రేమను అంగీకరించలేదని.. తనను ప్రేమించినట్లు చెప్పి కొంతకాలం కలిసి ఉన్న తర్వాత పెళ్లికి అంగీకరించలేదనే కారణంతో కొంతమంది ప్రేమోన్మాదులు దారుణాలకు పాల్పడిన ఘటనల సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందనే కోపంతో ఆమె తల్లితండ్రులపై కాల్పులు జరిపాడో వ్యక్తి! ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
అవును... ప్రేమించిన అమ్మాయిని తనకు దూరం చేశారనే కారణంతో ఆమె తండ్రిపై కక్షగట్టాడు ఓ యువకుడు. ఈ నేపథ్యంలో అతడిపై పిస్టల్ తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో సదరు యువతి తండ్రి కుడి కంటికి గాయం అయినట్లు చెబుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఓ వ్యాపారి (57) కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే.. అతడి చిన్న కుమార్తె స్కూల్ లో చదివేటప్పటి నుంచీ ఆమె తోటి విద్యార్థి బల్వీర్ (25) ప్రేమ పేరుతో వేధించేవాడంట. అంబర్ పేటకు చెందిన ఇతడు ఆమెతో పాటు ఓకే కాలేజీలో ఇంజినీరింగ్ చదివారు.
అప్పటి నుంచీ నిత్యం ఆమెను వేధించేవాడని చెబుతున్నారు.. ఇప్పటికీ ఆ వేధింపులు ఆగలేదని అంటున్నారు! ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో ఆరు నెలల కిందట బల్వీర్ ను హెచ్చరించారట. దీంతో... అప్పటి నుంచి ఆ యువతి తండ్రిపై బల్వీర్ కక్షగట్టి.. అతడిని చంపేస్తానని తన స్నేహితులవద్ద చెప్పేవాడని అంటున్నారు.
ఇదే సమయంలో... కొన్ని రోజుల ముందు ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగడంతోపాటు.. చంపేస్తానంటూ ఆమె తండ్రిని బెదిరించినట్లు చెబుతున్నారు. ఇక, పరిస్థితులు శృతిమించిపోతున్నాయనో ఏమో కానీ... తన కుమార్తెను ఇటీవల విదేశాలకు పంపించేశాడు ఆ తండ్రి. దీంతో... అతడిపై మరింతగా కక్ష పెంచుకున్నాడు బల్వీర్.
ఈ నేపథ్యంలోనే... ఆదివారం ఆ యువతి ఇంటికి వెళ్లి, ఆమె తండ్రిపై ఎయిర్ పిస్టల్ తో ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సదరు యువతి తండ్రి కుడి కంటికి తీవ్రగాయం అయ్యింది. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నారని.. చికిత్స పొందుతున్నారని.. నిందితుడి నుంచి ఎయిర్ గన్, ఎయిర్ పిస్టల్, పెల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.