గులాబ్‌జామ్, మైసూర్‌పాక్, రసగుల్లా.. నేతలకు యువతి వల!
శ్వేతాగౌడ అనే మహిళ మాజీమంత్రి పేరు చెప్పుకొని బెంగళూరు కమర్షియల్ వీధిలో ఓ జ్యువెల్లరీ షాప్ నుంచి రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లింది.
By: Tupaki Desk | 25 Dec 2024 3:30 PM GMTగులాబ్‌జామ్, మైసూర్‌పాక్, రసగుల్లా.. ఇవి స్వీట్ల పేర్లు అని అందరికీ తెలుసు. కానీ.. ఈ పేర్లకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇటీవల నేతలను మోసం చేసిన కేసులో పట్టుబడిన యువతి ఫోన్‌లో ఫీడ్ అయిన నంబర్లు కొన్నింటికీ ఈ స్వీట్స్ నేమ్స్ ఉన్నాయి.
శ్వేతాగౌడ అనే మహిళ మాజీమంత్రి పేరు చెప్పుకొని బెంగళూరు కమర్షియల్ వీధిలో ఓ జ్యువెల్లరీ షాప్ నుంచి రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లింది. ఈ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే.. ఈ కేసులో నోటీసులు అందుకున్న మాజీమంత్రి వర్తూరు ప్రకాశ్ భారతినగర పోలీస్ స్టేషన్‌లో విచారణకు అటెండ్ అయ్యారు.
ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్ ద్వారా శ్వేతాగౌడ పరిచయమని, ఆ తర్వాత సమాజ సేవ చేస్తున్నాననంటూ మాట్లాడినట్లు పోలీసులు వర్తూరు వివరించారు. ఒకటి రెండు సందర్భాల్లో భేటీ అయినట్లు చెప్పారు. బహుమతి అంటూ బ్రాస్ లేట్, ఉంగరం ఇచ్చారని చెప్పారు. వాటిని పోలీసులకు అందించారు. రూ.12.50 లక్షల విలువైన నగదు కూడా వాపసు చేశారు. అయితే.. తన పేరు చెప్పి రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారనే విషయం వ్యాపారి ఫోన్ చేసే వరకు కూడా తనకు తెలియదన్నారు. తనతోపాటు పలువురు రాజకీయ నాయకులతో ఫొటోలు తీసుకొని ఇలా మోసం చేసినట్లు తెలుస్తున్నదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. శ్వేతాగౌడ ఫోన్‌లో వర్తూరు ప్రకాశ్ పేరును గులాబ్ జామ్‌గాను.. బీజేపీ నాయకుడు చలపతి పేరును మైసూర్‌పాక్‌గానూ, మరో వ్యక్తి పేరు రసగుల్లాగా ఫీడ్ చేసుకున్నట్లు గుర్తించారు. వర్తూరు ప్రకాశ్ పలు బంగారు దుకాణాలకు శ్వేతాగౌడతో కలిసి వెళ్లినట్లు సమాచారం. అయితే.. దీనిపై బంగారం వ్యాపారి సంజయ్ బాప్నా స్పందించారు. తమ వద్ద ఆభరణాల కొనుగోలుకు వర్తూరు ప్రకాశ్, శ్వేతాగౌడ ఇద్దరూ వచ్చారని తెలిపారు. తొలిసారి డబ్బు చెల్లించారని, దాంతో తాము వర్తూరు ప్రకాశ్ ఇంటికే ఆభరణాలు డెలివరీ చేశామని చెప్పారు. ఆ తర్వాతే శ్వేతాగౌడ 2.9 కిలోల ఆభరణాలు తీసుకొని నగదు ఇవ్వకుండా మోసం చేసినట్లు తెలిపారు.