యువ ముఖ్యమంత్రులు : తెలుగు పాలిటిక్స్ లో నయా ట్రెండ్...
అస్సాం గణపరిషత్ తరఫున సీఎం అయిన ప్రపుల్ల కుమార్ మహంత వయసు ఆనాటికి జస్ట్ ముప్పయి మూడేళ్ళు మాత్రమే.
By: Tupaki Desk | 7 Dec 2023 3:30 AM GMTతెలుగు రాజకీయాల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అనుభవం సీనియారిటీని పక్కన పెట్టి నూతనత్వాన్ని ఆహ్వానిస్తున్నారు. తమకు నాయకుడు నచ్చాడంటే నేరుగా సీఎం కుర్చీనే అప్పగిస్తున్నారు. గతంలో దేశంలో ఇతర రాష్ట్రాల్లో అరుదుగా ఇలాంటి అద్భుతాలు జరిగాయి. 1985 ప్రాంతంలో అస్సాం లో అస్సాం గణపరిషత్ ని విద్యార్ధి యూనియన్ నేతలు స్థాపించి ఏకంగా కాంగ్రెస్ ని ఓడించి ఎన్నికల్లో గెలిచారు. అస్సాం గణపరిషత్ తరఫున సీఎం అయిన ప్రపుల్ల కుమార్ మహంత వయసు ఆనాటికి జస్ట్ ముప్పయి మూడేళ్ళు మాత్రమే. ఏ రాజకీయ నేపధ్యం లేకుండా నేరుగా ఎమ్మెల్యే అయి సీఎం అయిపోయారు.
ఆనాటికి దేశంలో ముఖ్యమంత్రుల సగటు వయసు అరవై నుంచి అరవై అయిదేళ్ళ మధ్య ఉండేది. ఎన్టీయార్ కూడా అరవై ఏళ్ళ వయసులో 1983లో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. ఆ తరువాత చూస్తే దేశంలోని కొన్ని రాష్ట్రాలలో యువ ముఖ్యమంత్రులు అక్కడక్కడ నెగ్గుతూ వచ్చారు. ఇక 1995లో ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. అప్పటికి ఆయన వయసు 45 ఏళ్ళు మాత్రమే. ఇక కాంగ్రెస్ కల్చర్ తీసుకుంటే సీనియర్లకే పెద్ద పీట వేస్తూ అరవైలు దాటిన వారికే పట్టం కడుతూ వచ్చింది.
కానీ తెలంగాణాలో కాంగ్రెస్ సీఎం గా ఎంపిక చేసిన రేవంత్ రెడ్డి మాత్రం రాజకీయంగా చూస్తే యువ ముఖ్యమంత్రి కిందనే లెక్క. ఇక నిన్నటి దాకా తెలంగాణా సీఎం గా పనిచేసిన కేసీఆర్ వయసు డెబ్బై ఏళ్ళు. ఈసారి తెలంగాణా ఎన్నికల్లో ఫలితాలు మారడానికి యువత కూడా ప్రధాన కారణం అని అంటున్నారు. కొత్త ఓట్లు దాదాపుగా 17 లక్షల దాక నమోదు అయ్యాయని అంటున్నారు.
యువత ఆలోచనా విధానం ప్రకారం యూత్ లీడర్లకే అవకాశం దక్కుతోంది అని అంటున్నారు. ఏపీలో చూసుకుంటే నాలుగున్నరేళ్ళ క్రితమే జగన్ యువ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవి నుంచి తప్పుకునే నాటికి బాబు వయసు 69 ఏళ్ళు. తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏడు పదుల చంద్రశేఖరరావుకు 55 ఏళ్ల వయసు ఉన్న రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ కోసం పోరు సాగింది. కాంగ్రెస్ తన సీఎం అభ్యర్ధిని ప్రకటించకపోయినా రేవంత్ రెడ్డినే యువత అంతా నాయకుడుగా చూసి ఓటెత్తింది అని గణాంకాలు చెబుతున్నాయి.
ఇపుడు ఏపీ ఎన్నికలు ముందు ఉన్నాయి. ఏపీ ఎన్నికల్లో ఏడున్నర పదుల వయసు కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్థిగా విపక్షం వైపు నుంచి రేసులో ఉన్నారు. జగన్ 2024 ఎన్నికల నాటికి 52 ఏళ్ల వయసులో సీఎం కోసం పోటీ పడుతూ వైసీపీ తరఫున ఉంటారు. ఈసారి ఏపీలో మరో ఇరవై లక్షల దాకా కొత్త ఓటర్లు ఉంటారని అంటున్నారు. అలాగే ఇరవై నుంచి ముప్పయి అయిదు లోపు యువతరం కూడా పెద్ద ఎత్తున ఏపీలో ఉన్నారు.
మరి వీరంతా ఈసారి ఎన్నికల్లో ఎవరిని సీఎం గా ఎన్నుకుంటారు అన్నది చర్చగా ఉంది. గతంలో చూస్తే సీఎం కావాలంటే అనుభవం ఉండాలి. మంత్రిగా అనేక దఫాలుగా పనిచేసి ఉండాలి. తలపండాలి. ఆరున్నర పదుల వయసు నిండాలి ఇలా చాలా తెలియని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కానీ ఇపుడు ఎమ్మెల్యే అయితే చాలు డైరెక్ట్ సీఎం పోస్టే అంటోంది యువతరం. యువత చాయిస్ కూడా అలాగే ఉంది.
ఏపీ సీఎం జగన్ కానీ తెలంగాణాకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎన్నడూ మంత్రులుగా పనిచేసిన అనుభవం లేదు. కానీ వారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రులు అయిపోయారు. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం యువ నాయకత్వానికి తెలుగు నాట ఓటు అన్నది అర్థం అవుతోంది.
ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా యువ నాయకుడే. ఆయన కూడా సొంతంగా జనసేన పెట్టి రాజకీయాల్లో పదేళ్ళుగా ఉంటున్నారు. మారుతున్న ట్రెండ్ ని పరిగణనలోకి తీసుకుని పవన్ సొంతంగా పోటీ చేస్తే ఆయనకు కూడా యువత ఓటెత్తే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. అన్ని పార్టీల కంటే ఎక్కువ యువ అభిమానులు యువ ఓట్లు పవన్ కే ఉన్నారు అన్నది కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా యువ నేతలు ముందుకు వస్తే మాత్రం సీనియర్లు వెనక్కి తప్పుకోవాల్సిందే అంటున్నారు. అంటే పొలిటికల్ గా కంపల్సరీ రిటైర్మెంట్ అన్న మాట.