6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేను ఓడించిన 26 ఏళ్ల యువతి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. 119 స్థానాలకు గాను 64 స్థానాలలో గెలుపొంది సింగల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది.
By: Tupaki Desk | 4 Dec 2023 3:43 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. 119 స్థానాలకు గాను 64 స్థానాలలో గెలుపొంది సింగల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. కాంగ్రెస్ మిత్రపక్షంగా బరిలోకి దిగిన సిపిఐ ఒక స్థానం గెలవడంతో మొత్తం కాంగ్రెస్ కూటమి బలం 65కు చేరింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఇద్దరు యువనేతలు ఘన వజయం సాధించి సత్తా చాటారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన హేమాహేమీలను సైతం కాంగ్రెస్ అభ్యర్థులు మట్టి కరిపించి గెలుపొందారు.
ముఖ్యంగా 26 ఏళ్ల వయసున్న ఇద్దరు యువనేతలు కాంగ్రెస్ తరఫున గెలుపొందడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పై మెదక్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపొందారు. తన తొలి ఎన్నికల పోటీలోనే పద్మాదేవేందర్ రెడ్డి వంటి సీనియర్ నేతను ఓడించారు. రోహిత్ తండ్రి మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఓడిపోగా.. రోహిత్ మాత్రం విజయం సాధించారు. తనతో పాటు రోహిత్ కు టికెట్ ఇవ్వకపోవడంతోనే బిఆర్ఎస్ నుంచి మైనంపల్లి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే.
ఇక ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావును 26 ఏళ్ల యశస్వి రెడ్డి మట్టి కరిపించారు. ఎర్రబెల్లి దయాకర్ ట్రాక్ రికార్డును బద్దలు కొడుతూ తన తొలి పోటీలోనే యశస్విని రెడ్డి ఘనవిజయం సాధించి రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉందని చాటిచెప్పారు. ఈ నేపథ్యంలోనే మైనంపల్లి రోహిత్, యశస్విని రెడ్డిల గెలుపు తో తెలంగాణ రాజకీయాల లో కాంగ్రెస్ పార్టీ ఓ నవశకానికి, యువ శకానికి నాంది పలికింది.