Begin typing your search above and press return to search.

జై జగన్...పొలిటికల్ ర్యాంగింగ్ ని తట్టుకోవడం కష్టమే...!

ఈసారి కూడా హోరా హోరీ పోరు ఉంటుందని సర్వేలు అన్నీ చెబుతునాయి తప్ప ఏకపక్షంగా విజయం ఒక వైపే అని చెప్పడం లేదు.

By:  Tupaki Desk   |   8 April 2024 2:35 PM GMT
జై జగన్...పొలిటికల్ ర్యాంగింగ్ ని తట్టుకోవడం కష్టమే...!
X

ఎవరు అవునన్నా కాదన్నా జగన్ పక్కా మాస్ లీడర్. అంతే కాదు ఆయన ఏపీలో బలమైన పార్టీకి అధినేత. ఒకసారి చాన్స్ అంటూ అయిదేళ్ల పాలించిన సీఎం. ఈసారి కూడా హోరా హోరీ పోరు ఉంటుందని సర్వేలు అన్నీ చెబుతునాయి తప్ప ఏకపక్షంగా విజయం ఒక వైపే అని చెప్పడం లేదు.

జగన్ బలం ఏంటో తెలుసు కనుకనే టీడీపీ కూటమి కట్టింది అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే జగన్ సొంత గడ్డ కడప. అక్కడ వైఎస్సార్ ఫ్యామిలీకి ఎంతో ఆదరణ ఉంది. వైఎస్సార్ వారసుడు ఎవరు అన్న దానికి 2011లోనే జనాలు తీర్పు ఇచ్చేశారు. కాంగ్రెస్ కి రాజీనామా చేసి 2011 మే నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో ఏకంగా అయిదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో జగన్ విజయ బావుటా ఎగరవేశారు.

ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ కడప జనాలు జగన్ కి జై కొట్టారు. 2014, 2019లలో అండగా జనాలు నిలుచున్నారు. కడప గడపలో వైసీపీకి జగన్ కి ఎదురులేదు అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల దాకా జగన్ కి మద్దతుగా ఉన్న ఆయన చెల్లెలు షర్మిల ఈసారి జగన్ కే ఎదురు నిలిచారు. ఆయన వైఎస్సార్ వారసుడు కాడు అంటున్నారు.

తన చిన్నాన్నను హత్య చేసిన వారికి జగన్ మద్దతు ఇస్తున్నారు అని కడప ఎంపీ అవినాష్ రెడ్డి జగన్ లను కలిపి మరీ విమర్శలు చేస్తున్నారు. అయితే ఆమె మరచిపోతున్న విషయం ఏమిటి అంటే ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. సీబీఐ విచారణలో ఉంది. అప్పటిదాకా అవినాష్ రెడ్డి నిందితుడే తప్ప హంతకుడు కాదు. చట్టం కూడా అదే చెబుతోంది. రెండేళ్ళకు పైగా శిక్ష పడితేనే వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఆ విధంగా చూస్తే అవినాష్ రెడ్డి ఇపుడు పోటీ చేయడానికి ఏ విధంగా అనర్హుడో షర్మిల చెప్పాల్సి ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇక వైఎస్ వివేకా కాంగ్రెస్ లోకి ఎపుడైతే వెళ్ళి మంత్రి పదవిని పొంది జగన్ కి విజయమ్మకు వ్యతిరేకంగా 2011 ఎన్నికల్లో పోటీ చేశారో నాటి నుంచి అవినాష్ రెడ్డి కుటుంబం జగన్ కి గట్టి మద్దతుగా ఉంటూ వస్తోంది. వైఎస్సార్ కి వైఎస్ వివేకా కుడి భుజం అయి ఉంటే ఉండొచ్చు కానీ జగన్ జమానాలో అవినాష్ రెడ్డి ఆయన ఫ్యామిలీ బలంగా నిలబడ్డారు.

మొత్తం కడపలో అవినాష్ రెడ్డికి బలం బలగం ఉంది. అందుకే వైఎస్ వివేకా గతంలో వైఎస్సార్ కి ఏలా ఉంటూ వచ్చారో అలాగే అవినాష్ రెడ్డి జగన్ కి ఉంటున్నారు. అందుకే జగన్ కడప పార్టీ బాధ్యతలు అన్నీ అవినాష్ రెడ్డికే అప్పగించి తాను సీఎం గా ఉంటున్నారు.

ఇది వైఎస్ వివేకా ఫ్యామిలీకి నచ్చకపోవచ్చు. దాంతో పాటుగా తన అన్నను సీఎం గా చేసిన షర్మిలకు ఏ విధమైన పదవులు దక్కలేదు. ఆమెలో రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని 2021లో పార్టీ పెట్టిన తరువాతనే లోకానికి తెలిసింది. తాను జగన్ కోసం మూడు వేల పై చిలుకు పాదయాత్ర చేశాను అని ఆమె చెబుతున్నారు.

కానీ ఆమెకు పార్టీలో అన్యాయం జరిగితే దానికి జనాలకు బాధ్యత ఏముంటుంది. ఇక జగన్ మీద వ్యతిరేకత తో ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టారని, ఏపీలో కాంగ్రెస్ లో చేరారు అని జనాలు నమ్ముతున్నారని అంటున్నారు. ఆ విధంగానే ఆమె స్టేట్మెంట్స్ కూడా ఉంటున్నాయని అంటున్నారు.

అందుకే కడపలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా పీసీసీ చీఫ్ గా షర్మిల చేస్తున్న పర్యటనలకు ఆదరణ అంతంతమాత్రంగా ఉంటోంది. పైగా ఆమె ఎక్కడైనా మాట్లాడితే అక్కడికి వైసీపీ అభిమానులు చేరుకుని జై జగన్ అంటూ పొలిటికల్ ర్యాగింగ్ చేస్తున్నారు

ఇక మైదుకూరులో జరిగిన షర్మిల సభలో ఇలాగే జై జగన్ అంటూ కొంతమంది యువకులు నినాదాలు చేస్తే షర్మిల ఫైర్ అయ్యారు. వారి నుంచి ఒక యువకుడిని స్టేజ్ మీద మైక్ ఇచ్చి అసలు జగన్ ఏపీకి ఏమి చేశారో చెప్పమన్నారు

దానికి ఆ యువకుడు జగన్ ఈజ్ గ్రేట్ అంటూ ప్రసంగం మొదలెట్టారు. జగన్ 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి తమకు అండగా ఉంటున్నారు అని ఆ యువకుడు చెప్పడం విశేషం. అంతే కాదు, జగన్ పాదయాత్ర చేసి ఎన్నో సమస్యలు ప్రజల నుంచి తెలుసుకుని దానిని అధికారంలోకి వచ్చాక నెరవేర్చారని చెప్పాడు. హామీలు నెరవేర్చిన ఘనత జగన్ దే అన్నారు.

మీ కుటుంబ తగవులు తెచ్చి జగన్ ని ఏమైనా అంటే ఊరుకోమని షర్మిలకు స్టేజ్ మీదనే చెప్పేశాడు ఆ యువకుడు. అంతే కాదు తెలంగాణాలో ముందు పార్టీ పెట్టి అక్కడ పోటీ చేయలేదని ఏపీకి వచ్చి జగన్ మీద వ్యతిరేకంగా మాట్లాడడం న్యాయమా అని ప్రశించారు.

అనంతరం ఆ యువకుడి నుంచి మైక్ అందుకున్న షర్మిల మాట్లాడుతూ జగన్ కి తాను కూడా ప్రచారం చేసి పెట్టాను అన్నారు. ఆయన సంపూర్ణ మద్య పాన నిషేధం అన్నారు. దానిని అమలు చేశారా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఉద్యోగాలు ఇచ్చారా అని నిలదీశారు. ప్రత్యేక హోదా అంటూ కేంద్రం మీద వత్తిడి పెట్టి తెస్తామన్నారు తెచ్చారా ఇలా అనేక హామీలు జగన్ తప్పాడని షర్మిల చెబుతున్నా ఆ యువకులు వినకుండా జై జగన్ అంటూ విసిగించేశారు.

వీటి సంగతి పక్కన పెడితే దేశంలో మధ్య పాన నిషేధం ఎక్కడా అమలు కావడంలేదు. అది సీరియస్ హామీ వైఫల్యంగా ఎవరూ చూడడం లేదు. చంద్రబాబు కూడా తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం ఇస్తామని అంటున్నారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ ఎంత తక్కువగా మాట్లాడితే మంచిది అంటున్నారు. అడ్డగోలుగా ఏపీని విభజించిన కాంగ్రెస్ ఇపుడు ఈ హామీ పేరుతో వస్తే ఎవరు నమ్ముతారు అన్నది కూడా జనాల నుంచి వస్తున్న ప్రశ్న.

జగన్ హోదాను తేలేకపోవడంలో బీజేపీదే తప్పు అన్నది మెజారిటీ జనాల భావనగా ఉంది. కాబట్టి ఆ విషయంలో జగన్ ని తప్పు పట్టడం లేదు. జాబ్ క్యాలెండర్ అని జగన్ చెప్పి అమలు చేయలేదని అంటున్నారు. కానీ లక్ష యాభై వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు. అదే విధంగా వివిధ ప్రభుత్వ సంస్థలలో ఖాళీలు భర్తీ చేశారని ఓవరాల్ గా ఆరు లక్షల దాకా జగన్ ఉద్యోగాలు ఇచ్చారని వారు చిట్టా విప్పుతున్నారు. మొత్తానికి షర్మిల విమర్శలు జనాలకు ఎక్కేవి ఏమీ లేవని తేల్చేస్తున్నారు. మరి షర్మిల ఈ అంశాలను కాకుండా ఇతర విషయాల మీద ఫోకస్ పెట్టి జగన్ మీద రాజకీయ విమర్శలు చేసే ఏమైనా చూస్తారేమో అంటున్నారు.