ఎస్ఐ ముందు తలదువ్వుకున్న కుర్రాడికి శిరోముండనం
తమ పట్ల ఎస్ఐ వ్యవహరించిన తీరును తట్టుకోలేని ముగ్గురుయువకుల్లో ఒకరు ఆత్మహాత్యాయత్నం చేసుకోవటంతో ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 20 Oct 2024 8:06 AM GMTఅరాచకానికి పరాకాష్ఠ అన్నట్లుగా చోటు చేసుకున్న ఈ ఉదంతం తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చకు తెర తీసింది. ఎంత పోలీసు అయితే మాత్రం.. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చా? వెనుకా ముందు చూసుకోకుండా చేపట్టే చర్యలకు బాధ్యత వహించటం ఉండదా? అన్న ప్రశ్నతోపాటు.. ఈ తరహా ధోరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయకూడదన్న మాట వినిపిస్తోంది. ఒక ఉదంతంలో పోలీసుల అదుపులో ఉన్న యువకుల్లో ఒకరు ఎస్ఐ ముందు క్రాఫ్ సరి చేసుకున్నాడన్న ఉక్రోషంతో.. ఆ బ్యాచ్ లోని వారందరికి గుండ్లు కొట్టించిన షాకింగ్ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల పోలీసు స్టేషన్ లోచోటుచేసుకుంది. తమ పట్ల ఎస్ఐ వ్యవహరించిన తీరును తట్టుకోలేని ముగ్గురుయువకుల్లో ఒకరు ఆత్మహాత్యాయత్నం చేసుకోవటంతో ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల హెడ్ క్వార్టర్ లోని పెట్రోల్ బంకు సిబ్బందితో స్థానికంగా ఉండే ముగ్గురు యువకులు వాగ్వాదానికి దిగారు. పెట్రోల్ విషయంలో వీరి మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో పెట్రోల్ సిబ్బంది పోలీసులకు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ముగ్గురు యువకుల్ని స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్ఐ ఎదుట..ముగ్గురిలో ఒకరు తల దువ్వుకోవటాన్ని ఎస్ఐ జగన్ తీవ్రంగా పరిగణించారు. అంతే.. ముగ్గురు యువకుల్ని శిరోముండనం చేయించారు.
అనంతరం వారిని హెచ్చరించి పంపేశారు. అవమాన భారంతో తిరిగి వచ్చిన ముగ్గురు యువకుల గురించి తెలుసుకున్న గ్రామస్తులు.. వారిని పరామర్శించి.. పోలీసుల తీరును తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో ముగ్గురిలో ఒక యువకుడు అవమాన భారంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో ఎస్ఐ జగన్ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.
ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు సదరు ఎస్ఐ అందుబాటులోకి రాలేదు. అదే సమయంలో బాధితుడి కుటుంబ సభ్యుడు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దీంతో.. ఈ శిరోముండనం ఏ సందర్భంలో జరిగింది? అసలు జరిగిందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గొడవ జరిగిన పెట్రోల్ బంక్ యాజమాన్యం సైతం స్పందించకపోవటంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.