పువ్వే ఆమె ప్రాణాలు తీసిందా?
కేరళకు చెందిన సూర్య సురేంద్రన్ అనే 24 ఏళ్ల యువతి మూడు రోజుల క్రితం వికసించిన పువ్వును తిని మరణించడం జరిగింది.
By: Tupaki Desk | 13 May 2024 1:30 PM GMTవాన రాకడ ప్రాణం పోకడ తెలియవంటారు. వాన ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రాణం ఎప్పుడు పోతుందో అంతకన్నా తెలియదు. ఒక్కోసారి మన మరణాన్ని మనమే రాసుకుంటాం. మనకు తెలియకుండా చేసే పనుల వల్ల మన ప్రాణమే పోవచ్చు. దీనికి ఉదాహరణే కేరళలో జరిగిన ఓ సంఘటన. ఓ యువతి పువ్వు, దాని ఆకు తిన్న పాపానికి మరణించడం గమనార్హం. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది.
కేరళకు చెందిన సూర్య సురేంద్రన్ అనే 24 ఏళ్ల యువతి మూడు రోజుల క్రితం వికసించిన పువ్వును తిని మరణించడం జరిగింది. ఆమె నర్సు. విమానాశ్రయంలో అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించగా ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె మరణానికి కారణాలు ఏంటని ఆరా తీయగా ఓ పువ్వు, దాని ఆకులు తినడంతోనే జరిగినట్లు తెలిపారు.
పోస్టుమార్టం నివేదికలో కూడా అదే విషయం బయటపడింది. ఓ ప్రదేశంలో ఆమె పువ్వు, దాని ఆకులను తెంపి తింటుంది. దాని ద్రవం శరీరంలోకి ప్రవేశించి ఒక రోజు తరువాత కుప్పకూలిపోయింది. దీంతో ఆమెకు మరణం తథ్యం అయింది. తాను చేయని పాపానికి బలైంది. ఆదివారం ఉదయం పల్లిపట్టిలోని తన ఇంటి నుంచి బంధువులతో కలిసి విమానాశ్రయానికి చేరకోగానే కుప్పకూలింది. దీనికి కారణం పువ్వు, ఆకులే అని తేల్చారు.
ఆమె మరణంపై పోస్టుమార్టం నిర్వహించారు. అంతర్గత అవయవాలు దెబ్బతినడం వల్లే ఆమె చనిపోయిందని తేల్చారు. దీంతో ఆ మొక్కను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన మొక్కను కనిపించకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేవుడి పూజకు ఈ పువ్వును ఉపయోగించొద్దని నిషేధించింది. దీనికి బదులు తులసి పువ్వును వాడుకోవాలని సూచించింది. ఇంట్లో పిల్లలు ఉన్న వారు కూడా ఈ మొక్క విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ మొక్కను అరాలి లేదా కనవిరం అని పిలుస్తారు. హైవేలు, బీచ్ ల వెంట ఇవి విరివిగా కనిపిస్తాయి. దీంతో వీటిని సమూలంగా తొలగించాలని డిమాండ్ పెరుగుతోంది.