Begin typing your search above and press return to search.

కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయం... సాయిరెడ్డి మరోసారి ఫైర్!

దీంతో పురందేశ్వరి లక్ష్యంగా గతకొన్ని రోజులుగా సాయిరెడ్డి చేస్తున్న విమర్శలూ కంటిన్యూ అవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:47 AM GMT
కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయం... సాయిరెడ్డి మరోసారి ఫైర్!
X

పురంధేశ్వరి ఇటీవల పదే పదే చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మద్దతును... చెల్లెలి భర్తగా చంద్రబాబుపై చూపిస్తున్నారనుకోలేమని అంటున్నారు పరిశీలకులు. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా మారిన తర్వాత ఈ వ్యవహారంలో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైన తర్వాత టీడీపీ నేతలకంటే ఎక్కువగా ఆమె వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని అనుకోవచ్చు.

ఇదే సమయంలో నారా లోకేష్ - అమిత్ షా భేటీకి కూడా కిషన్ రెడ్డిని ఒప్పించే విషయంలో ఆమె కీలక భూమిక పోషించారని అంటున్నారు. ఈ సమయంలో గతకొంతకాలంగా పురందేశ్వరి వ్యవహారం చూస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆన్ లైన్ వేదికగా వెంటాడుతున్నారు! ఇందులో భాగంగా... ఆమె ఎందుకిలా చేస్తున్నారు..? అసలు ఆమె అజెండా ఏమిటి..? అనే విషయాన్ని సూటిగా ప్రస్తావిస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

ఇందులో భాగంగా... "స్వార్థం, కపటం పురంధేశ్వరి సహజ ఆభరణాలు. టీడీపీతో పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారు. బంధుత్వం మాటున ఆమె రహస్య ఎజెండా ఏమిటంటే.. బావ చంద్రబాబు సహాయంతో ఎంపీగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారు. అందుకే ఆయనపై ఈగ కూడా వాలకుండా విసనకర్ర ఊపుతున్నారు" అంటూ ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి.

ఇదే సమయంలో తాజాగా మరో ట్వీట్ చేశారు సాయిరెడ్డి. ఇందులో భాగంగా... "పురందేశ్వరి గారు... కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు... మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే. మీ అంతిమ లక్ష్యం కుల "ఉద్దారణే". మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు.. స్వార్థం తప్ప. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం" అని నేరుగా అటాక్ చేశారు.

దీంతో పురందేశ్వరి లక్ష్యంగా గతకొన్ని రోజులుగా సాయిరెడ్డి చేస్తున్న విమర్శలూ కంటిన్యూ అవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో కుదిరితే విశాఖ, లేకపోతే మరో చోట నుంచి లోక్ సభకు పోటీ చేయాలనేది పురంధేశ్వరి ఆలోచన అని చెబుతున్నారు. అయితే... ఈ పరిస్థితుల్లో ఒంటరిగా బీజేపీ నుంచి బరిలో దిగితే ఆమె గెలవడం దాదాపు అసాధ్యం అనేది విశ్లేషకుల గట్టి అభిప్రాయం.

ఒకవేళ టీడీపీ, జనసేనతో పొత్తులో ఉన్నా టికెట్ ఖరారు చేయాల్సింది మాత్రం చంద్రబాబే కావడంతో... ఈ కూటమితో బీజేపీ పొత్తులో ఉన్నా లేకున్నా ఆమెకు అటునుంచి సాయం అవసరం అని అంటున్నారు. ఈ క్రమంలో... ఒకవేళ టీడీపీ - జనసేన పొత్తులో బీజేపీ లేకపోయినా.. పురంధేశ్వరి పోటీ చేసే చోట బలహీన అభ్యర్థిని బరిలో దింపడం వంటివి కూడా చంద్రబాబు చేతిలోని పనే! ఈ కారణంగానే ఆయన్ను ప్రసన్నం చేసుకునే విషయంలో పురంధేశ్వరి తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతున్నారని అంటున్నారు.

అందువల్లే పురందేశ్వరి గతం మరిచిపోయి చంద్రబాబుపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని ఒకరంటే... గతం మరిచిపోవడం ఏమీ లేదు గతంలోనుంచీ ఈ లోపాయకారీ ఒప్పందం ఇద్దరి మధ్యా ఉంది, కాకపోతే ఇప్పుడు బయటపడిందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు! ఈ సమయంలోనే విజయసాయిరెడ్డి ట్వీట్ల రూపంలో పురందేశ్వరిపై మండిపడుతున్నారు.. విమర్శలదాడి పెంచుకుంటూపోతున్నారు! ఈ అటాక్ ఎంతవరకూ వెళ్తుందనేది వేచి చూడాలి!