Begin typing your search above and press return to search.

ఏపీలో ఇ-మెయిల్ పంపే సామర్థ్యం ఉన్న యువత వీరే!

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్... భారతదేశంలోని ప్రముఖ టెక్ హబ్‌ లలో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 May 2024 6:11 AM GMT
ఏపీలో ఇ-మెయిల్  పంపే సామర్థ్యం ఉన్న యువత వీరే!
X

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్... భారతదేశంలోని ప్రముఖ టెక్ హబ్‌ లలో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ కూడా ఐటీలో దూసుకుపోతుందని చెబుతున్నారు. కానీ... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50శాతం కంటే ఎక్కువ మంది యువత ఇ-మెయిల్ కూడా పంపలేరని ఒక రిపోర్ట్ తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో ఈ విషయంలో టాప్ లో ఉన్న రాష్ట్రం.. లీస్ట్ లో ఉన్న ప్రాంతాల వివరాలు వెలువడ్డాయి.

అవును... దేశంలోని కంప్యూటర్ నాలెజ్డ్ పట్టణ యువతలో 61% ఉండగా.. గ్రామీణ యువతలో 34 శాతమే ఉందని.. ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2024 వెల్లడించింది. ఇదే క్రమంలో ఇంటర్నెట్ వినియోగం పట్టణాల్లో 57.53శాతంగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 25.30శాతం ఉందని తెలిపింది. ఇదే సమయంలో ఇ-మెయిల్ పంపగలిగే సామర్ధ్యం ఉన్న యువత వివరాలనూ రాష్ట్రాల వారీగా వెల్లడించింది.

ఇందులో భాగంగా... ఇ-మెయిల్ పంపగల సామర్ధ్యం అత్యధికంగా కేరళ యువతలో 73.34శాతం ఉండగా, తర్వాత స్థానంలో తమిళనాడు 72.28%గా ఉంది. ఇక అత్యల్పంగా అస్సాం 13.55%, ఉత్తరప్రదేశ్ 14.31%, బీహార్ 14.66% గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... తెలంగాణలో 45.46% మంది, ఏపీలో 36.38% మంది మాత్రమే ఇ-మెయిల్ ను పంపగల సామర్ధ్యం కలిగి ఉన్నారని వెల్లడించింది.

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా ప్రచురించిన ఈ నివేదిక దేశంలోని 15 - 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత యొక్క ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ నైపుణ్యాలను కొలుస్తుంది. ఇదే క్రమంలో... ఫోల్డర్ ను మూవ్ చేయగల కెపాసిటీ ఏపీలో 45.56%, తెలంగాణలో 53.83% ఉందని వెల్లడించింది.

ప్రాథమికోన్నత విద్య లేదా ఆపై ఉన్నతవిద్య అభ్యసించిన యువత నిష్పత్తి క్రమంగా పెరుగుతోందని.. 2000లో వీరి సంఖ్య 35.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 65.7 శాతానికి పెరిగిందని తాజాగా విడుదలైన ఇండియా ఎంప్లాయిమెంట్‌ రిపోర్ట్‌ 2024 వెల్లడించింది. ఇదే సమయంలో దేశంలో 2000– 2019 మధ్యలో యువత నిరుద్యోగిత శాతం దాదాపు మూడింతలు (5.7 – 17.5 శాతం) పెరిగిందని తెలిపింది! అయితే.. 2022 నాటికి అది 12.4 శాతానికి తగ్గింది తెలిపింది!