నోటికి వచ్చినట్లు మాట్లాడి.. ఇప్పుడు భయంగా ఉందంటున్నాడు
బుద్ధి లేనోడు.. చదువు సంద్యలు లేనోడు సైతం మాట్లాడటానికి ఇష్టపడని మాటల్ని.. సంచలనం కోసం.. మరింత పాపులార్టీ కోసం మాట్లాడి అందరికి ఆగ్రహాన్ని తెప్పించాడు ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్లాబాదియా.
By: Tupaki Desk | 16 Feb 2025 5:32 AM GMTబుద్ధి లేనోడు.. చదువు సంద్యలు లేనోడు సైతం మాట్లాడటానికి ఇష్టపడని మాటల్ని.. సంచలనం కోసం.. మరింత పాపులార్టీ కోసం మాట్లాడి అందరికి ఆగ్రహాన్ని తెప్పించాడు ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్లాబాదియా. అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన ఇతగాడికి డబ్బులకు కొదవ లేదు. ఆ మాటకు వస్తే హాలీవుడ్ స్టార్స్ తో సైతం పాడ్ కాస్ట్ చేసిన ఇతడు.. ఇటీవల చేసిన ఒక వీడియోలో రాయలేనంత దారుణ వ్యాఖ్యలు చేయటం.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. కేసులు బుక్ చేయాలని ఆదేశించటం తెలిసిందే.
ఇష్టారాజ్యంగా మాట్లాడేసి.. యావత్ దేశం ఛీ కొడుతున్న వేళ.. అతను లెంపేసుకొని తప్పు అయిపోయిందని.. తనను వదిలిపెట్టమని వేడుకుంటున్నాడు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అతనిపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తన మీద పెట్టిన కేసుల్ని ఒకేచోటకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును సైతం సంప్రదించగా.. అక్కడా రణవీర కు ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉంటే తాను ఎక్కడికి పారిపోలేదంటూ చెబుతున్నాడు. అయితే పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నట్లుగా.. అతడి ఫోన్లు స్విచ్చాఫ్ అయినట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి వేళ.. అతని నుంచి ఒక నోట్ సోషల్ మీడియాలో పోస్టు అయ్యింది. తాను.. తన టీం పోలీసులకు సహకరిస్తున్నామని.. వారందరికి తాను అందుబాటులోనే ఉన్నట్లుగా పేర్కొన్నారు. ‘తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశాను. వారిని అవమానించాను. అందుకు నన్ను క్షమించటం. ఈ విషయంలో నేను కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సింది’’ అని పేర్కొన్నారు. ఈ నోట్ లోనే కాస్త బాధ్యతగా ఏంటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. చేసింది దారుణ నేరమైనప్పుడు.. కాస్త బాధ్యత ఏంటి? పూర్తి బాధ్యత అనటానికి సైతం మనసు రావట్లేదా? అన్నది ప్రశ్న.
పలువురు తనను చంపుతానని బెదిరిస్తున్నారని.. తనతో పాటు తన కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. రణవీర్ తల్లి డాక్టర్ అన్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల్లో తన తల్లి క్లినిక్ కు కొందరు పేషెంట్ల మాదిరి నటిస్తూ వచ్చి.. అక్కడ విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ‘నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ.. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. పోలీసులపై.. భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. ఇన్ని మాటలు.. ఇన్ని ఇబ్బంది పడే బదులు.. నోటిని అదుపులోకి పెట్టుకొని ఉంటే ఈ గొడవే ఉండేది కాదు కదా? అన్న మాట వినిపిస్తోంది.