Begin typing your search above and press return to search.

నెమలి కూర ఎలా వండాలో చూపించాడు.. తెలుగు యూట్యూబర్ అరెస్ట్!

అవును... రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యూట్యూబర్ ప్రణయ్ కుమార్.. ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:32 AM GMT
నెమలి కూర ఎలా వండాలో చూపించాడు.. తెలుగు యూట్యూబర్  అరెస్ట్!
X

జాతీయపక్షి నెమలిని వేటాడటం నేరం అనే సంగతి తెలిసిందే. అయితే... వేటాడటమే కాదు ఏకంగా ఓ నెమలిని వేటాడి కూర వండేశాడు ఓ యూట్యూబర్! పైగా.. ఆ కూర ఎలా వండాలో చెబుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషయం ఫారెస్ట్ అధికారుల దృష్టికి వెళ్లింది. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అవును... రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యూట్యూబర్ ప్రణయ్ కుమార్.. ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. అతడి ఛానెల్ కు, వీడియోలకు మంచి ఫాలోవర్సే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ చేయకూడని పని ఒకటి చేశాడు. చట్టపరమైన నిబంధనను అతిక్రమించాడు. ఇందులో భాగంగా ఏకంగా జాతీయ పక్షి నెమలిని కూర వండేశాడు!

ఆ క్రమంలో నెమలి కూరా ఎలా వండాలో చెబుతూ రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో.. ఆ వీడియో వైరల్ అయ్యింది. అన్ని వంటలూ అందరూ చేసేశారు వెరైటీగా ప్లాన్ చేయాలనుకున్నాడో ఏమో కానీ ఇలాంటి పని చేశాడు. ఇలా ఏకంగా జాతీయ పక్షిని వండి, దానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేయడంతో నెటిజన్లు షాకయ్యారు.

ఈ నేపథ్యంలోనే ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారూ రంగంలోకి దిగారు. ఈ సమయంలో ప్రణయ్ కుమార్ ను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు వండిన నెమలికూరను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఇదంతా నిజం కాదని, యూట్యూబ్ లో వ్యూస్ కోసం ఇలా చేసినట్లు ప్రణయ్ చెబుతున్నాడని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ కూరను టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించారని అంటున్నారు. ఇదే సమయంలో అతడి రక్త నమూనాలనూ సేకరించినట్లు చెబుతున్నారు. అది నెమలి మాంసం అని నిరూపణ అయితే ప్రణయ్ కు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది! కాగా.. గతంలో ఇతడు పందికొక్కు, ఊసరవెల్లి లను ఉపయోగించి వంటకాలు చేసిన వీడియోలూ పోస్ట్ చేసినట్లు చెబుతున్నారు!