యూట్యూబర్ ప్రాణాలు తీసిన నెటిజన్ల కామెంట్లు!
ఈ రీల్స్‌కు నెటిజన్ల నుంచి కూడా ఆదరణ బాగానే ఉంది. అయితే.. ఏమైందో ఏమో.. తాజా రీల్స్‌పై.. నెటిజన్లు బండబూతులు తిడుతూ. అనరాని మాటలు అన్నారు.
By: Tupaki Desk | 26 Nov 2023 6:22 AM GMTమాటలు(కామెంట్స్) ఎంత జాగ్రత్తగా ఉండాలో.. ఎదుటి వారి విషయంలో ఎంత ఆచితూచి వ్యవహరించా లో ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు చేసే కామెంట్లు ఒక్కొక్కసారి.. హద్దులు మీరుతున్నాయి. తమకు నచ్చినవారి విషయంలో ఒకలా.. నచ్చకపోతే.. మరోలా. బండ బూతులతో విరుచుకుపడడం రివాజుగా మారింది. కనీసం ఎడిట్ చేయలేని పరిస్థితిలో ఈ వ్యాఖ్యలు ఉండడం ఎంతో మందిని కలవరపెడుతున్న విషయం తెలిసిందే.
రాజకీయ నాయకుల పై నిత్యం నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వారికి నచ్చిన వారిని ఆకాశానికి ఎత్తేయడం.. నచ్చకపోతే.. బండబూతులతో విరుచుకుపడడం తెలిసిందే. సరే.. ఇది రాజకీయం కాబట్టి సర్దుకు పోవచ్చు. కానీ.. సోషల్ మీడియా వేదికగా పాపులారిటీ కోరుకునే యువతీ యువకుల విషయంలోనూ నెటిజన్లు ఇలానే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలతో యూట్యూబర్లు.. తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. నెటిజన్లు చేసిన తప్పుడు కామెంట్లకు ఏకంగా ఓ యూట్యూబర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
సంచలనం సృష్టించిన ఈ ఘటన వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ప్రన్సు అనే 16 ఏళ్ల యువకుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. యూట్యూబ్, సహా.. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో రోజూ సందడి చేస్తాడు. ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం.. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆడవారిలాగా అలంకరించుకుని ప్రవర్తిస్తాడు. ఈ రీల్స్‌కు నెటిజన్ల నుంచి కూడా ఆదరణ బాగానే ఉంది. అయితే.. ఏమైందో ఏమో.. తాజా రీల్స్‌పై.. నెటిజన్లు బండబూతులు తిడుతూ. అనరాని మాటలు అన్నారు.
అచ్చం అమ్మాయిని తలపించేలా.. అలంకరించుకున్న ప్రన్సు.. ఆభరణాలు ధరించి రీల్ చేశాడు. దీనిని సోషల్ మీడియాలోనూ పోస్టు చేశాడు. ఇది చూసిన నెటిజన్ల నుంచి ఏకంగా 4000 కామెంట్లు వచ్చాయి. అయితే.. ఒక్క కామెంట్ కూడా.. ప్రశంసగా లేదు. పైగా బండ బూతులు, అనలేని వినలేని మాటలే ఉన్నాయి. దీంతో మనస్తాపం చెందిన ప్రన్సు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.