పక్కదేశం కీలక నిర్ణయం.. యూట్యూబ్, వాట్సప్ బ్యాన్!
సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 Aug 2024 6:13 AM GMTసోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఏదైనా ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగినప్పుడు.. సమాచార వ్యాప్తిలో కీలక భూమిక పోషిస్తున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంస్ ని నిలిపేస్తుంటారనేది తెలిసిన విషయమే.
అయితే... తాజాగా భారత్ పక్కదేశం బంగ్లాదేశ్ ఇలాంటి చర్యకే ఉప్క్రమించిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... అక్కడ జరుగుతున్న నిరసనలు వెల్లువెత్తడం.. ఈ నిరసనల్లో ఇద్దరు పౌరులు మృతి చెందడం.. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోన్న నేపథ్యంలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంస్ ని బంగ్లా ప్రభుత్వం బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది.
అవును... ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అంశంపై గత జూలై నెలలో బంగ్లాదేశ్ లో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో ఏకంగా 200 మందికి పైగా పౌరులు మరణించిన పరిస్థితి. ఈ మేరకు బంగ్లా ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి రాజధాని ఢాకాలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి.
వీటిలో సుమారు 2000 మందికి పైగా ఆందోళనకారులు పాల్గొని ప్రదర్శనలు చేపట్టారు. ఈ సమయంలో పోలీసులకు - ఆందోళనకారులకూ మధ్య చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో భాస్పవాయు గోలాలను ప్రయోగించారు. ఇదే సమయంలో భాషప్వాయువుతోపాటు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు పోలీసులు. దీంతో... సుమారు 50 మంది గాయపడగా.. ఓ పోలీసు మరణించారు.
ఈ నేపథ్యంలో బంగ్లాలో నిరసనలు మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఈ నిరసనలు మరింత వ్యాపించకుండా బంగ్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని.. ఇందులో భాగంగానే యూట్యూబ్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ లను బ్యాన్ చేసినట్లు చెబుతున్నారు. శుక్రవరం మధ్యాహ్నం నుంచి అక్కడ ఈ యాప్స్ పనిచేయడం లేదని తెలుస్తోంది!