కడప జిల్లా నేతలకు జగన్ మార్క్ క్లాస్
సొంత జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ పార్టీ పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిసింది.
By: Tupaki Desk | 30 Oct 2024 1:30 AM GMTసొంత జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ పార్టీ పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. నాయకుల మధ్య అనైక్యతను ఆయన సూటిగా ప్రశ్నించినట్లు చెబుతున్నారు, వైసీపీకి కీలకమైన కడప జిల్లాలోనే ఈ రకమైన రాజకీయం ఏమిటి అన్నట్లుగా ఆయన నేతలకు క్లాస్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాధ్ రెడ్డిని పార్టీ నడిపిస్తున్న తీరు మీద జగన్ ప్రశ్నించారు అని అంటున్నారు. కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు కడప టీడీపీ ఎమ్మెల్యే పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు చెత్తను పోసిన సంఘటనను జగన్ సీరియస్ గా తీసుకున్నారు అని అంటున్నారు
ఇంత పెద్ద విషయం జరిగితే ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోయారు అని జగన్ నేతలను ప్రశ్నించారు అని అంటున్నారు. అంతే కాదు కడపలో కానీ ఇతర నియోజకవర్గాలలో కానీ పార్టీ యాక్టివిటీ పెద్దగా లేకపోవడం పట్ల ఆయన నేతలను అడిగినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గాలలో పార్టీని పటిష్టంగా ఉంచాలని ఆయన ఆదేశించారు
అంతే కాదు కడప నియోజకవర్గం ఇంచార్జిగా మాజీ మంత్రి అంజాద్ భాషా మాటే ఫైనల్ అని జగన్ స్పష్టం చేశారని అంటున్నారు. ఇదేవిధంగా జమ్మలమడుగులో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిల మధ్య పోరుని జగన్ సర్దుబాటు చేశారు అని అంటున్నారు. ఇద్దరు నేతలను పిలిచి ఆయన మంతనాలు జరిపారని అంటున్నారు.
జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జి పదవి కోసం ఇద్దరు నేతలూ పోటీ పడుతున్నారు. ఇద్దరూ రెండు పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నారు అయితే జగన్ వారికి సర్దిచెప్పారు. ఇద్దరికీ మొత్తం జమ్మలమడుగులోని ఆరు మండలాలను చెరి మూడు పంచి ఆ మండలాల పరిధిలో మాత్రమే పర్యటనలు చేయాలని ఆ విధంగా పనిచేస్తూపోవాలని సూచించారు అని అంటున్నారు.
రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాలు, సుధీర్ రెడ్డికి ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం మండలాలు పంచినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నచ్చుకోలెదని అలిగి వెళ్లిపోయారని అంటున్నారు. అయితే ఇదే ఫైనల్ అని జగన్ గట్టిగా స్పష్టం చేయడంతో నేతలు దారికి వచ్చారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బలమైన కడపలో వైసీపీ ఎందుకు డీలా పడింది అన్నది జగన్ ఆరా తీస్తున్నారు అని అంటున్నారు. నాయకులతో ఆయన చర్చలు జరుపుతూనే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ని తెలుసుకుంటున్నారు అని అంటున్నారు.