అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలా..!
తమకు మాట్లాడనిచ్చే అవకాశం ఇవ్వబోరని అందుకే.. సభకు వెళ్లే విషయంపై ఆలోచన చేస్తున్నామని ఇటీవల జగన్ చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 9 Nov 2024 3:30 PM GMTప్రస్తుతం ఇదే విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలు.. రాజీనామా చేయాలా? లేకపోతే.. వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుందా? ఉంటే అలా ఎప్పుడై నా జరిగిందా? అనేది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రధాన చర్చ. దీనికి కారణం.. వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు.. దీనికి కొనసాగింపుగా ఆయన సోదరి, కాంగ్రెస్ చీఫ్ షర్మిల చేసిన కామెం ట్లు. మొత్తంగా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలా? అనే పెద్ద చర్చ సాగుతోంది.
తమకు మాట్లాడనిచ్చే అవకాశం ఇవ్వబోరని అందుకే.. సభకు వెళ్లే విషయంపై ఆలోచన చేస్తున్నామని ఇటీవల జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. ఆయన ఉద్దేశం ప్రకారం.. సభకు వెళ్లకుండా మీడియా పాయింట్ లో మీటింగ్ పెట్టాలనేది కావొచ్చు. కానీ, సభకు వెళ్లాలనేది ప్రజాస్వామ్య వాదుల ఉద్దేశం. ఇక, ప్రస్తుతం సభకు వెళ్లని వారి గురించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అనేది ప్రశ్న. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
భారత రాజ్యాంగం ప్రకారం.. ఆర్టికల్ 168 రాష్ట్రాలకు శాసన సభ ఉంటుందని, అది గవర్నర్ ఆధ్వర్యంలో నడుస్తుందని మాత్రమే చెబుతోంది. ఇక, ఆర్టికల్ 81-178 మధ్య పార్లమెంటు, శాసన సభల అధికారాలను వివరించినా.. ఎక్కడా కూడా.. సభలకు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే.. మొత్తంగా సభలో సభ్యులు ఎలా వ్యవహరించాలన్న విషయంపైనే రాజ్యాంగం స్పష్టం చేసింది తప్ప.. వారు సభకు రాకపోతే.. ఏం చేయాలన్న దానిపై మాత్రం చెప్పలేదు.
కారణం ఏంటి..
శాసనసభకు ఎన్నికయ్యే నాయకులు.. బాధ్యతగా ఉంటారని, ఇలాంటి తప్పులు చేయరని రాజ్యాంగ నిర్మాతలు భావించి ఉంటారు. అందుకే.. అసలు సభలకు రాని వారు! అనే మాట ఉత్పన్నం కాలేదు. ఇదిలావుంటే.. స్పీకర్ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? అంటే.. సభకు రాని వారి విషయంలో వారిని సస్పెండ్ చేసే అధికారం లేదు. అయితే.. భత్యాలు(అలవెన్సులు) మాత్రం ఇవ్వరు. కానీ, వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా.. ఇదీ సంగతి!!