Begin typing your search above and press return to search.

జగన్ సంచలన ఆరోపణలు.. వంశీ అరెస్టులో అధికార దుర్వినియోగం

వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ఆ పార్టీ అధినేత జగన్ స్పందించారు.

By:  Tupaki Desk   |   14 Feb 2025 11:09 AM GMT
జగన్ సంచలన ఆరోపణలు.. వంశీ అరెస్టులో అధికార దుర్వినియోగం
X

వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ఆ పార్టీ అధినేత జగన్ స్పందించారు. వంశీ అరెస్టును ఖండించిన ఆయన పోలీసులు, ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. తనతో తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఫిర్యాదు దారు న్యాయమూర్తి ముందు చెప్పి, అధికార పార్టీ కుట్రను బయటపెట్టినా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వంశీ అరెస్టుతోపాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని తీరుపైనా తన ఎక్స్ ఖాతాలో మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు.

‘‘రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబుగారు దుర్మార్గాలు చేస్తున్నారు.’’ అంటూ ఎక్స్ లో జగన్ పోస్టుచేశారు.

సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? అంటూ నిలదీశారు. మీ కక్ష తీర్చుకోవడానికి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శించారు. తప్పుడు కేసులో వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిగారిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని అన్నారు.

మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. ‘‘అబ్బయ్య చౌదరి డ్రైవరును టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్ల మంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా?’’ అంటూ నిలదీశారు జగన్. వైసీపీ నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నానంటూ ఎక్స్ లో జగన్ పోస్టు చేశారు.