జగన్‌కు ఎస్సీ వర్గీకరణ సెగ.. !
ఇలాంటి సమయంలో వైసీపీ తరఫున గళం వినిపించేందుకు మాల సామాజిక వర్గం నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
By: Tupaki Desk | 24 March 2025 5:12 AMవైసీపీ అధినేత జగన్‌కు మరో భారీ సెగ తగులుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల ఎస్సీ వర్గీకరణ పై మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో కూడిన ఏక సభ్య కమిషన్ ను నియమించిన విషయం తెలిసిందే. ఈ నివేదికను ఇటీవల అసెంబ్లీలోనూ ప్రవేశ పెట్టారు. ఇక, దీనిని కేంద్రానికి పంపించి.. ఆమోదం పొందిన తర్వాత.. దీనిని అమలు చేయనున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. వర్గీకరణ విషయంలో జగన్ వైఖరిపై మాదిగలు నిప్పులు చెరుగుతున్నారు.
మాలలకు అన్యాయం జరుగుతోందని.. ఈ వర్గీకరణ సరికాదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైసీపీకి ఏకాకిని చేస్తున్నాయి. వాస్తవానికి మాలలకు 7.5 శాతం వాటా ఇచ్చారు. మాదిగలకు ఈ నివేదికలో 6.5 శాతానికే పరిమితం చేశారు. అయినప్పటికీ.. మాలలకు అన్యాయం జరిగిందన్న వ్యాఖ్యలు సహజంగానే విమర్శలకు దారి తీశాయి. దీనిపై మంద కృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. జగన్.. రెండుకళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి సమయంలో వైసీపీ తరఫున గళం వినిపించేందుకు మాల సామాజిక వర్గం నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. పైగా.. వర్గీకరణను పూర్తిగా తప్పని వ్యాఖ్యానించడం ద్వారా ఇప్పటి వరకు అండగా ఉన్న మాదిగలు కూడా దూరంగా ఉండడం వంటివి జగన్‌కు రాజకీయంగా సెగ పెంచుతు న్నాయి. జిల్లాల పరంగా చూసుకుంటే. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాదిగలు ఎక్కువగా వైసీపీకి అండగా ఉన్నారు.
ఇప్పుడు మాలలకు మాత్రమే వైసీపీ పరిమితం అయ్యేలా వ్యాఖ్యానించిన దరిమిలా.. మాదిగలు చీలిపో యే అవకాశం ఉంది. మరో కీలక విషయం ఏంటంటే.. వర్గీకరణ సమయంలో ఏకసభ్య కమిషన్ నిర్వహిం చిన రాజకీయ సమావేశాలకు కూడా వైసీపీ నాయకులు ఎవరూ వెళ్లలేదు. తమ వాణిని, బాణిని వినిపించ లేదు. ఇది కూడా రాజకీయంగా వారికి ఇబ్బందిగానే ఉంది. ఇప్పటి వరకు నా ఎస్సీ.. అంటూ జగన్ చేసిన రాజకీయం ఇప్పుడు ఆయనకు ఎదురు తిరిగే ప్రమాదం ఏర్పడడం .. దీని నుంచి ఎలా బయట పడతారన్న చర్చ కూడా సాగుతున్నాయి.