వైసీపీ ఫ్యూచరేంటి.. జగన్ ఏం చేయాలి ..!
ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. ఇది ఇస్తే తప్ప అసెంబ్లీకి వచ్చేది లేదని జగన్ ప్రకటన.
By: Tupaki Desk | 27 Feb 2025 5:00 PM ISTప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. ఇది ఇస్తే తప్ప అసెంబ్లీకి వచ్చేది లేదని జగన్ ప్రకటన. ఈ రెండు పరిణామాల మధ్య ఏపీ ప్రతిపక్షం వైసీపీ నలిగిపోతోంది. ఒకవైపు కూటమి సర్కారు పంతం.. మరోవైపు.. తమ పార్టీ అధినేత భీషణ ప్రతిజ్ఞల తో వైసీపీ కేడర్ సహా ఎమ్మెల్యేలు కూడా నలిగిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగుతుందని అనుకున్నా.. ఇదేమీ రేపో మాపో తేల్చే అంశం కాదు. తేలే అంశం కూడా కాదు. మరో 4 సంవత్సరాలకు పైగానే వ్యవహారం సాగనుంది. మరోవైపుఈ కేసు కోర్టులో ఉందని అనుకున్నా.. నిర్ణీత కాల వ్యవధిలో ఈ కేసును పరిష్కరించాలన్న నియమాలేమీ కోర్టుకు లేదు.
దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్మథనం చెందుతున్నారు. మరో వైపు.. కూటమి కూడా బలంగా ఉండడం... తమ బంధం మరింత బలపడుతుందన్న వాదనలు చేయడం కూడా.. వైసీపీకి ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితిని కల్పిస్తోంది. సాధారణంగా కూటమి పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో చికాకులు.. పెకాకులుగా మారి.. బంధాలు బలహీన పడుతున్న పరిస్థితి ఉంటుంది. కానీ, ఇలాంటి వాటిని తాము సంయుక్తంగా ఎదుర్కొంటామే తప్ప.. తాము బలహీన పడేది లేదన్నది కూటమి చెబుతున్న మాట. ఇది మరింతగా వైసీపీలో రచ్చకు దారితీస్తోంది. అంటే.. తాము ఒంటరిగానే మరోసారి పోరుకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో వైసీపీ భవిష్యత్తు ఏంటి? ఎలా ముందుకు సాగాలి? జమిలి వచ్చినా.. సాధారణమే జరిగినా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. వైసీపీని తీరం చేర్చేందుకు ఉన్న మార్గాలు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరీ ముఖ్యంగా అధినేత వ్యవహార శైలిని కూడా తప్పుబడుతున్న నాయకులు పెరుగుతున్నారు. ''సభకు వెళ్దాం.. రాలేదన్న అపవాదు ఎందుకు? పైగా ప్రజలకు కూడా అన్నీ అర్ధమవుతున్నాయి'' అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాల మధ్యే చర్చ సాగుతోందంటే.. సభకు వెళ్లే విషయంపై ఎంతగా మధన పడుతున్నారో అర్ధం అవుతుంది.
ఈ నేపథ్యంలో జగన్ ముందున్న ప్రధాన కర్తవ్యాలు రెండే రెండు. ఒకటి సభకు వెళ్లడం. తద్వారా ఎదురయ్యే అన్ని అవమానాల ను ఆయన భరించడం.. తద్వారా.. ప్రజల నుంచి సానుభూతిని రాబట్టుకోవడం. వచ్చే నాలుగేళ్లలో సభలో తమ గురించి అవమానాలు ఎదుర్కొన్నారన్న సంకేతాలు పంపించడం ద్వారా.. గతంలో ఓదార్పు యాత్రలద్వారా లభించిన సానుభూతిని తిరిగి జగన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో అంశం ప్రజల మధ్యకు వెళ్లడం. ప్రజల సమస్యలను ప్రస్తావించడం.. తెలుసుకోవడం ద్వారా.. వాటిని ఎక్కువగా ప్రచారంలోకివచ్చేలా చేయడం. ఈ రెండు మాత్రమే వైసీపీకి జవజీవాలు అందిస్తాయని అంటున్నారు పరిశీలకులు.