Begin typing your search above and press return to search.

జగన్ కి కడప జడ్పీ బిగ్ చాలెంజ్ !

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కి అనూహ్యంగా ఒక బిగ్ చాలెంజ్ ఎదురవుతోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   20 March 2025 7:00 PM IST
జగన్ కి కడప జడ్పీ బిగ్ చాలెంజ్ !
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కి అనూహ్యంగా ఒక బిగ్ చాలెంజ్ ఎదురవుతోంది అని అంటున్నారు. ఆయన సొంత ఇలాకా అయిన కడప గడపలో కూటమితో బిగ్ పొలిటికల్ ఫైట్ కి రంగం సిద్ధం అయింది. కడప జెడ్పీ చైర్మన్ పదవికి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నిక సంఘం రెడీ అయింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

దీంతో రాష్ట్రంలో ఎన్నికల నగరా మోగినట్లు అయింది. రాష్ట్రంలో స్థానిక సంస్థలలో ఖాలీగా ఉన్న పదవుల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో కడప జడ్పీ ఛైర్ పర్సన్ ఎన్నికలు కీలకంగా ఉన్నాయి. మిగిలిన చోట్ల ఎంపీపీ సర్పంచులకు ఎన్నికలు ఉన్నాయి.

అయితే అందరికీ ఆకర్షిస్తున్నది మాత్రం కడప జెడీ పీఠానికి ఎన్నికలే. ఇక్కడ మొత్తం 50 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 49 జెడ్పీటీసీలు గెలుచుకుంది. ఒకే ఒక్క జెడ్పీటీసీని గోపవరం నుంచి టీడీపీ గెలిచింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కడప జెడ్పీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజంపేట నుంచి గెలిచారు.

ఇక నాటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ జెడ్పీ పీఠం మీద కన్నేసింది. మొత్తం కడపలో పది మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం పులివెందుల బద్వేల్, రాజంపేట లో మాత్రమే వైసీపీ గెలవడంతో ఈ జిల్లాలో కూటమి బలంగా ఉంది. దాంతో ఇపుడు జెడ్పీ పీఠం గెలుచుకుని జగన్ కి షాక్ ఇవ్వాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో కూటమి వైపుగా చాలా మంది జెడ్పీటీసీలను తిప్పుకోవాలని చూస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి అనేక మంది ఆ వైపుగా చూస్తున్నారు అన్న టాక్ కూడా ఉంది. దాంతో వైసీపీకి మరీ ముఖ్యంగా జగన్ కి కడప జడ్పీ పీఠం పెను సవాల్ గా మారుతోంది. టీడీపీకి ఎక్స్ అఫీషియ్లో మెంబర్స్ బలం ఉంది. దాంతో పాటు వైసీపీకి చెందిన జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకుంటే గెలుపు సునాయాసం అని భావిస్తోంది. దీంతో కడప జెడ్పీటీసీలకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది.

ఈ క్రమంలో వైసీపీ కూడా ఏదో విధంగా జెడ్పీ పీఠాన్ని నిలబెట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అవసరమైంతే క్యాంప్ రాజకీయాలకు కూడా తెర తీసి అయిన తమ వారిని కాపాడుకోవాలని చూస్తోంది. జెడ్పీ పీఠం కడపలో గెలిస్తే మాత్రం వైసీపీ అధినేత జగన్ కి అది రాజకీయంగా గట్టి షాక్ గా ఉంటుందని భావిస్తూ కూటమి పెద్దలు కూడా ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. మరి కడప జెడ్పీ పీఠం ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది.