ఇప్పటికీ 'తాడేపల్లి గేటు' దాట లేకపోతున్నట్టేనా..!
మరీ ముఖ్యంగా తాడేపల్లి ప్యాలస్‌కే పరిమితమై.. గతంలో నాయకులు, కార్యకర్తలు వచ్చినా.. తాను బయటకు రాకుండా వ్యవహరించిన తను మారుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు.
By: Tupaki Desk | 21 Feb 2025 6:50 AM GMTవైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని.. గతంలో చేసిన పొరపాట్లు ఇకపై జరగబోవని .. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం.. ఆయన కొన్నాళ్లు రెస్టు తీసుకుని.. తర్వాత నిర్వహించిన నియోజకవర్గాల ఇంచార్జ్‌ల సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో తమకు గౌరవం లభిస్తుందని.. నాయకులు, కార్యకర్తలు కూడా లెక్కలు వేసుకున్నారు.
మరీ ముఖ్యంగా తాడేపల్లి ప్యాలస్‌కే పరిమితమై.. గతంలో నాయకులు, కార్యకర్తలు వచ్చినా.. తాను బయటకు రాకుండా వ్యవహరించిన తను మారుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఎప్పుడు ఎవరైనా తన వద్దకు రావొచ్చని కూడా ఆయన సూచించారు. దీంతో పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులు గత నాలుగు రోజులుగా పార్టీ కార్యాలయానికి వస్తున్నారు.తమ తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలపై వారు వినతులు సమర్పించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. చిత్రంగా ఇప్పుడు కూడా.. జగన్ తన తీరును ఏమాత్రం మార్చుకోలేదు. గతంలో వ్యవహరించినట్టే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నాయకులు తాడేపల్లి గేటును దాటలేని పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. కార్యకర్తలు, నాయకుల కోసం.. ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి.. దానిలో ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఏర్పాటు చేశారు. ఆయన, ఆయనకు కేటాయించిన పీఏలు మాత్రమే నాయకులు, కార్యకర్తలను పలకరిస్తున్నారు.
అంటే.. ఇప్పుడు కూడా తాడేపల్లి ద్వారాలు.. తెరుచుకోవడం లేదన్నది సుస్పష్టం. వచ్చిన నాయకులు, కార్యకర్తలను కూడా.. తమ తమ స్థాయిలను బట్టి.. వేర్వేరు ద్వారాల గుండి లోపలికి అనుమతిస్తున్నారు. ఈ పరిణామాలతో వారంతా విసిగిపోతున్నారు. పైగా.. జగన్ కనిపిస్తాడని అనుకున్నవారు కూడా.. సజ్జల కనిపించడంతో విస్మయం వ్యక్తం చేసి.. పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు కూడా తమకు జగన్ కనిపించడం లేదని ఆవేదనతో.. తాము వచ్చిన సంగతిని సజ్జలకు వివరించి తిరుగు పయనం పడుతున్నారు. సో.. ఇదీ జగన్ 2.0 సంగతి..!